ఓటు కొనుగోలు: గుట్టుగా ఖాతాల్లోకి నిధులు

1 Apr, 2019 11:31 IST|Sakshi

ఓటు కొనుగోలుకు కీలకంగా మారిన సహకార బ్యాంకులు

ఆర్టీజీఎస్, నెఫ్ట్‌ విధానాలతో నిధుల మళ్లింపు

గుట్టుచప్పుడు కాకుండా వ్యక్తుల ఖాతాల్లో నిధుల జమ

ఆ మర్నాడే ఇతర వ్యక్తులకు నిధులు బదలాయింపు

నగదు లావాదేవీలకు ఈసీ నిఘా ఉంచాలని పలువురి డిమాండ్‌

సాక్షి, అమరావతి: ఎన్నికల రాజకీయ చట్రంలో సహకార బ్యాంకులు ఇరుక్కుపోయాయి. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి తమకు అనుకూలంగా మార్చుకోవడం అలవాటుగా చేసుకున్న టీడీపీ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలోనే గ్రామీణ సహకార బ్యాంకులను ఫుల్‌గా వాడేసుకుంది. కొన్ని గ్రామీణ బ్యాంకుల్లో ఎన్నికలు మూడు నెలలకు ముందుగానే తమకు అనుకూలమైన వ్యక్తుల పేరున పెద్ద మొత్తంలో నిధులు డిపాజిట్‌ చేసింది. ఎన్నికలకు పది రోజులకు ముందుగా ఆ మొత్తాలను ఇతర ప్రాంతాల్లోని గ్రామీణ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వ్యక్తులకు బదిలీ చేసి, అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థుల అనుచరులకు నగదు అందేలా ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందు ఇలా వ్యక్తుల పేరు మీద రూ.3 నుంచి రూ.5 కోట్లు డిపాజిట్‌ కావడం, ఒకటి రెండు నెలల్లోనే ఇతర ప్రాంతాల్లోని గ్రామీణ బ్యాంకులకు బదిలీ కావడం ఉద్యోగ వర్గాల్లో అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ గ్రామీణ బ్యాంకుల పాలకవర్గాలు టీడీపీ నేతల పరిధిలోనే ఉండటంతో ఉద్యోగ వర్గాలు మాట్లాడలేకపోయాయి. గ్రామీణ బ్యాంకుల పాలకవర్గ సభ్యులు ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులకు గుట్టుచప్పుడు కాకుండా నగదు అందే ఏర్పాటు చేసి పార్టీ గెలిచేందుకు తమ వంతు సహకారాన్ని అందించారు.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకులనూ వదలని ప్రభుత్వం
అప్పటి స్కెచ్‌ను గ్రామీణ సహకార బ్యాంకులకు పరిమితం కాకుండా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల వరకు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఎన్నికలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలనూ ప్రభుత్వం వాడుకునే ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకు అనువుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలకవర్గాల పదవీ కాలాన్ని ఫిబ్రవరిలో రెండోసారి కూడా పొడిగించింది. వాస్తవంగా ఒకసారి ఆరు నెలలపాటు పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగించిన తరువాత రెండోసారి పదవీ కాలాన్ని పొడిగించడానికి బలమైన కారణం ఉండాలి. లేకుంటే ప్రత్యేక అధికారి పాలనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈసారి ప్రత్యేక కారణాలు లేకపోయినా, ఐదారు నెలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ వీటి పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మొత్తం 9 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగించినా, అందులో మూడు కేంద్ర సహకార బ్యాంకుల పాలకవర్గాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతల పాలనలో ఉన్నాయి. ఈ మూడింటి పదవీ కాలం పొడిగించకుండా మిగిలిన ఆరు పాలకవర్గాల పదవీ కాలం పొడిగిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉందని భావించి ప్రభుత్వం తొమ్మిది పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగించింది.

కొద్ది మొత్తాలుగా బదిలీ
ఆర్థిక పరిస్ధితులు ఆశాజనకంగా లేని కొందరు రైతులు, వ్యక్తుల ఖాతాల్లో నిధులు పెద్ద మొత్తంలో డిపాజిట్‌ అతున్నాయని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. కొందరి ఖాతాల్లో జమ అయిన మొత్తాలు ఇతర ప్రాంతాల్లోని రైతులు, వ్యక్తుల పేరున ఆర్టీజీఎస్, నెఫ్ట్‌ విధానాల ద్వారా కొద్ది మొత్తాలుగా బదిలీ అవుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ నగదు బదిలీ కేవలం టీడీపీ అభ్యర్థులు, వారి అనుచరులకు అందచేయడానికేనని చెబుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల లావాదేవీలపై ఎన్నికల సంఘం నిఘా ఉంచాలని పలువురు కోరుతున్నారు.

రూ.4 వేల కోట్ల టర్నోవర్‌
రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పరిధిలో 2,808 ప్రాథమిక çవ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఈ సంఘాల్లోని రైతులందరికీ దాదాపుగా సేవింగ్స్‌ ఖాతాలుంటాయి. 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సంఘాల్లో సాలీనా రూ.4 వేల కోట్ల వరకు టర్నోవర్‌ జరుగుతోంది. రైతులకు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలకు ఈ బ్యాంకులు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను అందిస్తున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లకు డబ్బు అందచేయాలనే ఆలోచనలో టీడీపీ ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఆర్టీజీఎస్, నెఫ్ట్‌ విధానాలతో గుట్టుచప్పుడు కాకుండా నిధులను బదిలీ చేసి టీడీపీ అభ్యర్థులు, వారి అనుచరులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. ఇందుకు అనువుగా ఇటీవల శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలకవర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీటితోపాటు ఆప్కాబ్‌ పదవీ
కాలాన్ని పొడిగించింది.

మరిన్ని వార్తలు