సంకీర్ణంలోనే సంస్కరణలు

3 May, 2019 05:41 IST|Sakshi

ఏకపార్టీ ఆధిపత్యం కొన్నిసార్లు చేటు చేసింది

బలహీన ప్రభుత్వాల హయాంలో సాహసోపేత నిర్ణయాలు

తమను గెలిపిస్తే సుస్థిరమైన పాలనను అందిస్తామని, అనేక పార్టీలతో కూడిన విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వం మూణ్నాళ్ల ముచ్చటే అవుతుందని ప్రధాని మోదీ పదే పదే చెబుతున్నారు. అయితే, మన దేశానికి శక్తిమంతమైన నేతల కంటే పార్లమెంటులో మెజారిటీ లేని నేతల వల్లే మంచి జరుగుతోందని చరిత్ర చెబుతోంది.2014 ఎన్నికల ముందు వరకు మూడు దశాబ్దాల పాటు కేంద్రంలో ఏకపార్టీ ప్రభుత్వం లేదు. ఓటర్లు ఏ ఒక్క పార్టీకీ పూర్తి మెజారిటీ కట్టబెట్టలేదు.అప్పుడంతా దేశ రాజకీయాల్లో సంకీర్ణ శకం నడిచింది. అనేక పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల మంత్రివర్గంలో విభేదాలు తలెత్తడం, వేడివేడి చర్చలు, సంప్రదింపులు,బుజ్జగింపుల తర్వాత ఏకాభిప్రాయ సాధనతో ప్రధాన మంత్రులు విధాన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే, ఈ సంకీర్ణ(బలహీన) ప్రభుత్వాల హయాంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయింది. ఆర్థిక సంస్కరణలకు తెరలేచింది. దేశం వివిధ రంగాల్లో పురోభివృద్ధి సాధించింది. వృద్ధి రేటు పెరిగింది. కోట్ల మంది పేదలు దారిద్య్రరేఖ నుంచి బయట పడటం కూడా ఈ సంకీర్ణ ప్రభుత్వ శకంలోనే జరిగింది.

అయితే, సంకీర్ణ ప్రభుత్వాల ఆలోచన సరికాదని ఇప్పటికీ పలువురు భావిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో అసలైన వ్యవస్థాగత మార్పులు చూడాలంటే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఒకే పార్టీకి భారీ మెజారిటీ కట్టబెట్టాలని వారు గట్టిగా చెబుతున్నారు. మోదీ చెబుతున్నది కూడా ఇదే. అయితే, గత చరిత్రను పరిశీలిస్తే వాస్తవాలు  మరోలా  ఉన్నాయి. గత ఎన్నికల్లో  ఓటర్లు మోదీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టారు. మోదీ నాయకత్వంలోని బలమైన ప్రభుత్వం చెప్పుకోతగ్గ సంస్కరణలేమీ తీసుకురాలేదు. మోదీ తీసుకున్న ఏకైక ‘బలమైన’ విధాన నిర్ణయం.. పెద్ద నోట్ల రద్దు. సంకీర్ణ ప్రభుత్వం ఊహించడానికి కూడా వెనకాడే ఈ నిర్ణయం ఫలితంగా 2016, నవంబర్‌ నుంచి దేశ కరెన్సీలో 86 శాతం చెత్తబుట్టపాలయింది. నిజానికి మోదీ తీసుకున్న ఈ చర్యనే విపక్షాలు ప్రధాన ఎన్నికల ప్రచారాంశం చేస్తున్నాయి.

గత సంకీర్ణ ప్రభుత్వాల చరిత్రను పరిశీలిస్తే 1990వ దశకం చివర్లో కేవలం రెండేళ్లు మాత్రమే దేశాన్ని పాలించిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వమే సంస్కరణలను ముందుకు తీసుకెళ్లింది. అతి తక్కువ సమయం అధికారంలో ఉన్న యునైటెడ్‌ ఫ్రంట్‌ చేసిన ఈ పనిని పూర్తి మెజారిటీ పొందిన బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కూడా చేయలేకపోయాయి. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న ఆదాయం పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వమే. 1991 నాటి  సంస్కరణలు కూడా పార్లమెంటులో మెజారిటీ లేని ప్రభుత్వం తీసుకువచ్చినవే. ఆ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లింది కూడా ‘బలహీన ప్రధాని’అయిన మన్మోహన్‌ సింగ్‌. ఈ బలహీన ప్రధానే పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. కొన్ని సంవత్సరాల తర్వాత కేంద్రంలో మెజారీటీ ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వ హయాంలో సంస్కరణలు వేగం పుంజుకోలేదు. నిజం చెప్పాలంటే ఆ కాలంలో సంస్కరణలు  దాదాపు పూర్తిగా అటకెక్కాయనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సంకీర్ణ ప్రభుత్వమే మళ్లీ వాటిని బయటకు తీసింది.

పూర్తి మెజారిటీ సాధించిన ఒకే పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాల కంటే సంకీర్ణ ప్రభుత్వాలు బాగా పని చేస్తుంటే మన దేశంలోని మేథావులు వాటి గురించి ఎందుకు ఇంతగా భయపడుతున్నారు. ఇది ఒక రకంగా న్యూనతా భావమని చెప్పాలి. అమెరికా, బ్రిటన్‌ వంటి పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో సుస్థిరమైన ద్వంద్వ పార్టీ విధానం ఉంది. సంకీర్ణ ప్రభుత్వాలు సంక్లిష్టమైన సంస్కరణలు తీసుకురాలేవని, ప్రతికూల ఫలితాలనిచ్చే ఆర్థిక నిర్ణయాలు  తీసుకుంటాయన్న భయాలే సంకీర్ణాల పట్ల విముఖతకు కారణమవుతున్నాయి.

సంకీర్ణాలు సమ్మిళితాలు. భారత దేశ విలక్షణత అయిన భిన్నత్వంలో ఏకత్వానికి ఇవి ప్రతీకలు.భవిష్యత్తులో ఇబ్బందులు కలిగించే నిర్ణయాలేవీ ఇవి తీసుకోవు. తాజా ఎన్నికల్లో ఓటర్లు  ఏ నిర్ణయం తీసుకున్నారన్నది మే 23 వరకు తెలియదు. ఈ ఎన్నికల్లో మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చినా, పార్లమెంటులో ఆయన పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని చాలా మంది పరిశీలకులు అంగీకరిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమయితే మనం మళ్లీ సంకీర్ణ శకంలోకి వెళతాం.కాగా, అన్నింటికీ రాజీ పడుతూ బలహీనంగా  ఉండే సంకీర్ణ ప్రభు త్వం వద్దని అనేక మంది చెబుతున్నారు. అయితే, ఆ సంకీర్ణ ప్రభుత్వాలే దేశంలో నిజమైన మార్పుకు కారణమని గత పాతికేళ్ల చరిత్ర నిరూపిస్తోంది.

>
మరిన్ని వార్తలు