అభ్యర్థుల నేర చరిత్ర మీడియాలో ప్రకటించాలి

7 Apr, 2019 11:45 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌

సాక్షి, నల్లగొండ: ఎన్నికల్లో పారదర్శకత పెంచడంలో భాగంగా ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేర చరిత్ర, వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను అభ్యర్థులు స్వచ్ఛందంగా ప్రజలకు వెల్లడించాలని జిల్లా కలెక్టర్, నల్లగొండ పార్లమెంట్‌ ఎన్నికల నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తేదీ నుంచి ఎన్నికల ప్రచారం చివరి రోజు వరకు అభ్యర్థులు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్లకు మూడు సార్లు దిన పత్రికల్లో, మూడుసార్లు ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఈ వివరాలు ప్రకటించాలని అన్నారు.

ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాల ప్రకారం బరిలో ఉన్న అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్‌ కేసులు, నేరాలు రుజువై శిక్ష పడిన కేసుల వివరాలను ప్రజలకు తెలపాలని సూచించారు. దీని కోసం వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో సర్క్యులేషన్‌లో ఉన్న దిన పత్రికలు, శాటిలైట్‌ టీవీ ఛానెళ్లలో ప్రకనటనలు ఇవ్వాలని తెలిపారు. నామినేషన్ల తంతు  ముగిసినప్పటి నుంచి ప్రచారం చివరి రోజు వరకు మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇవన్నీ వేర్వేరు తేదీల్లో ఇవ్వాలని, న్యూస్‌ పేపర్లలో ప్రముఖంగా కనిపించే స్థలంలో ప్రకటనలు ఇవ్వాలన్నారు.

కనీసం పన్నెండు సైజ్‌ పాయింట్‌ను మెయింటైన్‌ చేయాలని, ఈ ఖర్చు పూర్తిగా అభ్యర్థి భరించాల్సి ఉంటుందని అన్నారు. ఫార్మాట్‌ సి 1, రాజకీయ పార్టీలు ఫార్మాట్‌ సి 2లో తెలపాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు ఫార్మాట్‌ సి 2లో పొందుపర్చిన అంశాలను ఆయా పార్టీల వెబ్‌ సైట్‌లో ఉంచాలని తెలిపారు. ఈ నిబంధనలు ఉల్లఘించిన వారిపై ఎన్నికల తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉందని, కేసులు లేని అభ్యర్థులు ప్రకటనలు ప్రచురించాల్సిన అవసరం లేదన్నారు.  

మరిన్ని వార్తలు