టీడీపీ ట్యాక్స్‌ వసూలు.. లోకేష్‌కు లంచాలు..

14 Jul, 2018 18:23 IST|Sakshi
గొల్లల మామిడాడ బహిరంగ సభలో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఎంపీ మురళీ మోహన్‌ కూతురికి 32 ఎకరాల భూమిని కేవలం ఎనిమిది లక్షలకే ధారాదత్తం..

సాక్షి, జి.మామిడాడ : ఎమ్మెల్యేలే ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీ ట్యాక్స్‌ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రాఎస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌​మోహన్‌ రెడ్డి దుయ్యబట్టారు. 212వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారంవ వైఎస్‌ జగన్‌ తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజల నుంచి అక్రమంగా ట్యాక్స్‌ వసూలు చేసి స్థానిక ఎమ్మెల్యే నుంచి మంత్రి లోకేష్‌ వరకూ అందజేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

ప్రతి ఎమ్మెల్యే రెండు లక్షలు వసూలు చేసి కలెక్టర్‌ ద్వారా లోకేష్‌కు పంపుతున్నారని వెల్లడించారు. 2014 ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారని, అధికారంలోకి వచ్చాక మాఫీ చేసిన డబ్బు, బుణాల వడ్డీకి కూడా సరిపోవట్లేదని అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక బ్యాంకులు వడ్డీలేని రుణాలను రైతులకు ఇవ్వడం లేదని, గిట్టుబాట ధర లేక రైతులు పంటలను అమ్ముకోలేక పోతున్నారని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారని.. నాలుగేళ్లయినా ఆ దిశగా ఒక్క అడుగూ వేయకుండా, గ్రామాల్లో మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నారని మండిపడ్డారు. ‘గ్రామాల్లో మద్యం వల్ల చంద్రబాబు నాయుడు ప్రజలను తాగుబోతులుగా మారుస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులు రుణాలు లేని వ్యవసాయం చేస్తున్నారు. ప్రభుత్వం బ్యాంకులకు డబ్బులు కట్టకపోవడం మూలంగా.. రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. పంటలకు మద్దుతు ధర ఇస్తామన్న బాబు నాలుగేళ్ల కాలంలో ఒక్క పంటకైనా మద్దతు ధర కల్పించారా? మద్దతు ధర లేక ప్రజలు పంటలను అమ్ముకోలేకపోతున్నారు.

రైతుల నుంచి పంటలను తక్కువ ధరకు కొనుగోలు చేసి తన సొంత హెరిటేజ్‌ షాపుల అధిక ధరకు వాటిని చంద్రబాబు అమ్ముకుంటున్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన సీఎం తానే దళారిగా మారి రైతులును దోచుకుంటున్నారు. అధిక ధర కలిగిన భూమిని స్థానిక ఎంపీ మురళీ మోహన్‌ కూతురికి 32 ఎకరాల భూమిని కేవలం ఎనిమిది లక్షలకే దారాదత్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేపీఆర్‌ ఇండస్ట్రీస్‌ అనుమతులను రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నాలుగేళ్లయినా కేపీఆర్‌పై ఏమైనా చర్యలు తీసుకున్నారా? వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే కేపీఆర్‌ ఇండస్ట్రీస్‌ అనుమతులను రద్దు చేస్తాం.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు 16వేల ఇళ్లను కట్టించారు. ప్రజలకు ఇళ్లు కటించాల్సిన చంద్రబాబు.. ప్రజల భూములను లాక్కుని ధళారిగా మారుతున్నారు. ఇలాంటి పాలన అవసరమా ఒక్క సారి ఆలోచించండి. ఇలాంటి పాలకులను బంగాళాఖాతంలో కలిపేయాలి. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి ఎలాంటి నాయకుడు కావాలో ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే నాయకులు రాజీనామా చేయాలి. మీ అందరి సహకారంతో వ్యవస్థలో మార్పు సాధ్యమవుతుంది’ అని వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు