పాఠశాల విద్యార్థులకు ఫీజుల పథకం!

23 Sep, 2018 02:39 IST|Sakshi

కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో చర్చ

25 శాతం చెల్లిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం

వివిధ వర్గాల సమస్యల అధ్యయనానికి 8 సబ్‌ కమిటీలు

15 రోజుల్లో కసరత్తు పూర్తి చేయాలని నిర్ణయం

‘తెలంగాణ ప్రజా మేనిఫెస్టో’గా నామకరణం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని, కనీసం 25 శాతం ఫీజు చెల్లించినా పేదలకు ఉపయోగకరంగా ఉంటుందనే విషయంపై చర్చించారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన పార్టీ మేనిఫెస్టో కమిటీ భేటీలో ఈ మేరకు చర్చ జరిగినట్లు సమాచారం.

కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలన్న దానిపై చర్చించారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని అసాధ్యమైన హామీలు ఇవ్వకుండా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపర్చడంపై దృష్టి సారించాలని పలువురు నేతలు సూచించారు.

కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం పెట్టిన తర్వాత చదువుకునే పేద విద్యార్థుల సంఖ్య పెరిగిందని, సాంకేతిక విద్యా రంగంలో మంచి మార్పు వచ్చిందని నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే పథకాన్ని ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా వర్తింపజేస్తే డ్రాపౌట్లు లేకుండా నివారించవచ్చనే అభిప్రాయం వ్యక్తమయింది. అయితే, లక్షలాది మందికి ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

అందుబాటులో ఫోన్‌ నంబర్‌
కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన కోసం అన్ని వర్గాల ప్రజలు, యూనియన్‌ నాయకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. దీనికోసం రాష్ట్రంలోని ఎవరైనా 8523852852కు ఫోన్‌ చేయవచ్చని మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ వెల్లడించారు. manifestotpcc@gmail.com, tcongressmanifesto అనే ఫేస్‌బుక్‌ ఐడీకి కూడా సలహాలు పంపవచ్చన్నారు. వివిధ వర్గాల ప్రజలు నేరుగా గాంధీభవన్‌కు వచ్చి కూడా విజ్ఞాపనలు ఇవ్వవచ్చని, దీనికోసం సోమవారం నుంచి ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 3 గంటల మధ్య నేతలు అందుబాటులో ఉంటారని చెప్పారు.


ప్రజా మేనిఫెస్టో...
పార్టీ మేనిఫెస్టోను.. ‘తెలంగాణ ప్రజా మేనిఫెస్టో’పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి జరిగేలా, ఆయా పథకాలతో వారి జీవితాల్లో మార్పులు వచ్చేలా మేనిఫెస్టోను అందించాలని అభిప్రాయపడ్డారు. దీనికోసం వివిధ రంగాల సమస్యలపై అధ్యయనం చేసేందుకు 8 మంది నేతృత్వంలో 8 సబ్‌కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఆయా కమిటీలు వివిధ రంగాల్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలు, అందుకు అవసరమైన పథకాలపై అధ్యయనం చేసి కమిటీకి నివేదిక ఇవ్వనున్నాయి.

ఇందుకోసం మేనిఫెస్టో కమిటీ సభ్యులు క్షేత్రస్థాయికి వెళ్లాలని, గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడాలని, నిపుణులతో చర్చలు జరపాలని నిర్ణయించారు. మరో 10 రోజుల పాటు పూర్తిస్థాయిలో మేనిఫెస్టో కమిటీ పనిచేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద 15 రోజుల్లోగా కసరత్తు పూర్తి చేసి పక్కా మేనిఫెస్టోను తయారు చేయాలని కమిటీ తొలి సమావేశం నిర్ణయించింది. కాగా, తొలి సమావేశానికి కమిటీ కో–చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరు కాలేదు. దీనిపై టీపీసీసీ వర్గాలు వివరణ ఇస్తూ.. కోమటిరెడ్డి నియోజకవర్గ కేంద్రంలో శనివారం వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయని, ముందుగా అనుకున్న కార్యక్రమాలు ఉండటంతో హాజరు కాలేదని చెప్పాయి.

మరిన్ని వార్తలు