కామ్రేడ్ల కయ్యం... ఎవరికి లాభం?

16 Oct, 2018 11:19 IST|Sakshi

కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్న సీపీఐ

బీఎల్‌ఎఫ్‌కు నాయకత్వం వహిస్తున్న సీపీఎం

రెండు పార్టీలపై వామపక్ష సానుభూతి పరుల అసంతృప్తి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వామపక్ష పార్టీల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోంది. వామపక్ష పార్టీల్లో బలంగా ఉన్న సీపీఎం, సీపీఐ పార్టీలు ఈ ఎన్నికల్లో చెరోపక్షం వహించడానికి దాదాపు సిద్ధమయ్యాయి. మహాకూటమి (కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ, తెలంగాణ ఇంటిపార్టీ)లో భాగస్వామిగా ఉండటానికి సీపీఐ నిర్ణయించింది. కనీస ఉమ్మడి కార్యక్రమంపై భాగస్వామ్య పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి కూడా వచ్చాయి. మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ పోటీచేయాల్సిన సీట్ల సంఖ్య, పోటీచేసే స్థానాలు వంటివాటిపై ఇంకా కసరత్తు జరుగుతోంది. సీపీఎం అగ్రభాగంలో ఉంటూ బీఎల్‌ఎఫ్‌ (బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌)ను ఏర్పాటుచేసింది. వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమ సంస్థలతో కలిసి బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ పేరుతో వేదికను ఏర్పాటుచేసింది. దీంతోపాటు ఇప్పటికే దాదాపు 60 మందితో అభ్యర్థుల జాబితాను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహాకూటమిలో భాగస్వామిగా ఉంటూ సీపీఐ, బీఎల్‌ఎఫ్‌ను ఏర్పాటుచేసిన సీపీఎం పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి.  

వామపక్షవాదుల్లో అసంతృప్తి
వామపక్ష పార్టీల మధ్య వైరంపై పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మిగిలిన చిన్నచిన్న కమ్యూనిస్టు పార్టీలను ఏకం చేయాల్సిన సీపీఐ, సీపీఎంలు పరస్పరం విమర్శలు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో సీపీఎం, సీపీఐ అభ్యర్థులు పరస్పరం పోటీపడే పరిస్థితులున్నాయి, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు సమదూరంలో ఉండాలనే నిర్ణయంలో భాగంగానే బీఎల్‌ఎఫ్‌ను ఏర్పాటు చేసినట్టుగా సీపీఎం నేత లు వాదిస్తున్నారు. పొత్తులతో ఇప్పటికే వామపక్ష ఉద్యమాలు చాలా బలహీనపడ్డాయని, ఇంకా స్వతంత్రంగా వ్యవహరించకుంటే మరిం త నష్టం జరుగుతుందని సీపీఎం నేతలు వాదిస్తున్నారు. వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాల ను బలోపేతం చేయడానికి సీపీఐ బీఎల్‌ఎఫ్‌లో చేరాల్సిందని, కాంగ్రెస్‌ పార్టీతో కలవడమే సరైంది కాదని అంటున్నారు.

అయితే సీపీఐ నేతలు ఈ వాదనను తిప్పికొడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తులతో కలవడమే సరైందని సీపీఐ వాదిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఎల్‌ఎఫ్‌కు, వామపక్షాలకు టీఆర్‌ఎస్‌ను ఓడించే స్థాయిలో శక్తి లేదని సీపీఐ వాదిస్తోంది. టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి ఐక్యంగా ఉండాల్సిన ఈ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం మంచి నిర్ణయం కాదని అంటున్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి అన్ని పార్టీలతో కలిసి పోరాడటం మినహా మరో మార్గం లేదంటున్నారు. అందుకే అన్ని పార్టీలతో కలిసి ఏర్పాటైన మహాకూటమిలో భాగస్వామిగా ఉన్నామని సీపీఐ నేతలు వాదిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా సీపీఎం పరోక్షంగా టీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నట్టేనని సీపీఐ వాదిస్తోంది. సీపీఎం కూడా మహాకూటమిలో చేరితే బాగుండేదని సీపీఐ నేతలు అంటున్నారు. ఏదేమైనా ఈ పార్టీ లు వేరుగా పోటీపడటం సరికాదని వామపక్షపార్టీల సానుభూతిపరులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు