చిన్న పార్టీలకు పెద్ద సవాల్‌

28 Dec, 2018 15:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాహుల్‌ గాంధీ ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నాయకుడు ఎంకే స్టాలిన్‌ డిసెంబర్‌ 16వ తేదీన ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే రాహుల్‌ గాంధీని తెలుగుదేశం, తృణమూల్‌ కాంగ్రెస్‌ లాంటి ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయిగానీ, తమిళనాడులో మాత్రం ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా కాంగ్రెస్‌ పార్టీ వైపే మొగ్గుచూపుతున్నాయి. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ గాంధీని అంగీకరిస్తున్నాయి. ‘విద్యుతలై చిరుతైగల్‌ గాట్చీ, మరుములార్చి ద్రావిడ మున్నేట్ర కళగం జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ నాయకత్వాన్ని, రాష్ట్ర స్థాయిలో డీఎంకే నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాయి. ఇక ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ ఇప్పటికే డీఎంకేతో పొత్తు పెట్టుకుంది.

మరోపక్క కమల్‌ హాసన్‌ రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు, పుదుచ్ఛేరిలోని ఒక్క సీటుకు తాను కొత్తగా ఏర్పాటు చేసిన ‘మక్కల్‌ నీది మయామ్‌’ పోటీ చేస్తుందని చెప్పారు. అంతేకాకుండా రానున్న 20 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కూడా తన పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. భావ సారూప్యత పార్టీలతో తమ పార్టీ పొత్తు పెట్టుకునేందుకు సుముఖంగా ఉందని ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు తెలిపారు. అయితే తాము ప్రధానంగా డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలను వ్యతిరేకిస్తున్నందున ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలో ప్రస్తుతానికి స్పష్టత లేదని వారు అంటున్నారు. అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం తిరుగుబాటు నాయకుడు టీటీవీ దినకరన్‌ గత మార్చి నెలలో ఏర్పాటు చేసిన ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ ఒంటిరిగా పోటీ చేయాలా, పొత్తులకు వెళ్లాలా ? అంశాన్ని ఇంకా తేల్చుకోలేదు. కమల్‌ హాసన్, దినకరన్‌లు తమ పార్టీలకు ఎన్నికల అనుభవం లేకపోయినా రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ మంచి ప్రభావాన్ని చూపగలవని భావిస్తున్నారు. ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీలకు ఇప్పుడు జయలలిత, ఎం. కరుణానిధి లేకపోవడమే తమ పార్టీలకు లాభిస్తుందని వారు ఆశిస్తున్నారు.

కేంద్రంలో ఫాసిస్ట్‌ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు తాము కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలుపుతున్నామని, అది వచ్చే ఎన్నికల నాటికి ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బలమైన ప్రత్యామ్నాయం అవుతుందని డీఎంకే అధికార ప్రతినిధి తమిళన్‌ ప్రసన్న తెలిపారు. చిన్నా, చితక పార్టీలు తమతో కలిసి వచ్చినా, లేకపోయినా ఫర్వాలేదని ఆయన దీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు