ఖాళీ ‘దేశం’!

25 Feb, 2018 02:10 IST|Sakshi

రాష్ట్రంలో నానాటికీ కొడిగడుతున్న టీడీపీ

రేవంత్‌ బాటలోనే ఒంటేరు.. మరికొందరు బీసీ నేతలు కూడా

ఎన్నికల్లో పోటీచేసే స్థాయి నేతలు కరువు

జిల్లా అధ్యక్ష పదవికీ దొరకని నాయకులు 

వేరే దారి చూసుకుంటున్న కేడర్‌

తెలంగాణ పార్టీపై అధినేత చంద్రబాబు చిన్నచూపు

కనీసం సమావేశాలూ నిర్వహించలేని పరిస్థితి

ఇప్పటికి రెండుసార్లు వాయిదా...

ఈనెల 28న కూడా అనుమానమే..!

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఆ పార్టీ నుంచి వెళ్లిపోయే వారే తప్ప వచ్చే వారు లేకపోవడం, పార్టీని నమ్ముకున్న కొద్దిమంది నేతలు, కేడర్‌లో ధైర్యం కల్పించే దిక్కు లేకపోవడంతో ఇక ఆ పార్టీ పని అయిపోయినట్లేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అసలు వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్థులను కూడా వెతుక్కోవాల్సిన దుస్థితి ఉందని అంటున్నారు.

వలసలతో ఖాళీ..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచే టీడీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జోగు రామన్న, పట్నం మహేందర్‌రెడ్డిలతోపాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి కీలక నేతలందరూ టీడీపీ నుంచి వెళ్లిపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 12 ఎమ్మెల్యేలు, ఒక్క లోక్‌సభ సభ్యుడు కూడా మెల్లగా టీఆర్‌ఎస్‌ బాట పట్టారు. టీఆర్‌ఎస్‌పై పోరాటం చేస్తున్నాడనుకునే నాయకుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.

మెదక్‌ జిల్లా నేత ఒంటేరు ప్రతాపరెడ్డి కూడా రేపోమాపో కాంగ్రెస్‌లో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఇక మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కూడా పార్టీ మారే యత్నంలో ఉన్నారు. చివరగా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఆర్‌.కృష్ణయ్యలతోపాటు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన మూడు, నాలుగు నియోజకవర్గాల నేతలు, జిల్లాకు ఒకరిద్దరు ముఖ్యనేతలు మాత్రమే టీటీడీపీలో కొనసాగుతున్నారు.

ఇక పార్టీ జెండాను మోసే కేడర్‌ను కదిలించే నాయకుడు లేక కార్యకర్తలంతా నిర్వేదంలో కూరుకుపోయారు. ఇటీవల టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ‘ఇంటింటికీ తెలుగుదేశం’కార్యక్రమం పేరిట నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ కనీసం 50 మంది కూడా గుమిగూడకపోవడం పార్టీ దుస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.

బీసీ నేతలేరీ..?
ఒకప్పుడు టీడీపీ అంటే బీసీలు అన్న పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బీసీలు టీడీపీకి పూర్తిగా దూరమయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దేవేందర్‌గౌడ్‌ లాంటి నేతలు పార్టీకి సమయం కేటాయించే పరిస్థితి లేకపోవడం, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వంటివారు పార్టీని వీడడంతో బీసీలను ఆకర్షించే పెద్ద నాయకులు టీటీడీపీలో కనిపించడం లేదు.

బీసీల ఉద్యమకారుడు ఆర్‌.కృష్ణయ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా.. పార్టీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అరవింద్‌కుమార్‌గౌడ్, బొల్లం మల్లయ్యయాదవ్‌ లాంటి నాయకులు పనిచేస్తున్నా వారికి పార్టీ తరఫున తగిన గౌరవం లేదనే ప్రచారముంది. మొత్తంగా టీడీపీలో భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో మిగతా బీసీ నేతలూ పార్టీ వీడే పరిస్థితి ఉందని టీటీడీపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

అధినేత అంతరంగమేంటి?
తెలంగాణలో టీడీపీ పూర్తిగా దెబ్బతింటున్నా పార్టీ అధినేత చంద్రబాబు పట్టించుకోవడం లేదని, తమ పట్ల వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. పార్టీ ప్రధాన కార్యాలయమున్న హైదరాబాద్‌లో తెలంగాణ కమిటీ సమావేశాలు జరిగే పరిస్థితి లేదని.. ఏపీలోని అమరావతికి వెళితే తప్ప చంద్రబాబు దర్శనం కావడం లేదని వారు వాపోతున్నారు. హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశారని, ఈనెల 28న సమావేశం ఉందంటున్నా.. జరుగుతుందన్న నమ్మకం లేదని అంటున్నారు.

మరిన్ని వార్తలు