అంతా పథకం ప్రకారమే!

5 Mar, 2019 03:54 IST|Sakshi

పోలీసులను ప్రతివాదులుగా చేరుస్తూ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌

ఫిబ్రవరి 27నే సేవాయాప్‌ అప్‌డేట్‌ 

కేసు నమోదైన 3 గంటల్లో హైదరాబాద్‌కు ఏపీ పోలీసులు

విచారణను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు

సాక్షి, హైదరాబాద్‌: డేటా చౌర్యం కేసులో ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ నిర్వాహకుల్ని రక్షించేందుకు యత్నిస్తున్నారా? కేసు నమోదుకు 4 రోజులు ముందే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయడం, గుంటూరు నుంచి ఏపీ పోలీసులు హైదరాబాద్‌కు కేవలం 3 గంటల్లో చేరుకోవడం, అశోక్‌ ఏపీకి పారిపోయాడంటూ ప్రచారం జరగడం చూస్తుంటే.. ఈ కేసుకు ఓటుకు కోట్లు కేసుతో చాలా సారూప్యతలు కనిపిస్తున్నాయి.  

ముందే పసిగట్టారా?
కొంతకాలంగా సేవామిత్ర యాప్‌ ద్వారా టీడీపీ వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో గ్రిడ్స్‌ నిర్వాహకులు ముందు జాగ్రత్తపడ్డారు. కేసు నమోదు కావ డానికి సరిగ్గా 4 రోజుల ముందు అంటే.. ఫిబ్రవరి 27న సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా అప్‌డేట్‌ చేశారు. వ్యక్తిగత సమాచారం సేకరణకు సంబంధించిన అంశాలను తొలగించిందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ఏపీ ప్రభుత్వం నుంచి దండిగా సహాయ సహకారాలు అందుతున్నాయని బాహాటంగానే అర్థమవుతోంది. భాస్కర్‌ కనిపించడం లేదం టూ గుంటూరు జిల్లా పెదకాకానిలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు కేసు నమోదైంది. కానీ, మాదాపూర్‌లో ఏపీ పోలీసులు రాత్రి 8.30గంటలకు ప్రత్యక్షమయ్యారు.

పెదకాకాని నుంచి హైదరాబాద్‌కు దాదాపు 300 కి.మీ. దూరం. గంటకు 100 కి.మీ. స్పీడుతో ప్రయాణించినా కేవలం 3 గంటల్లో చేరుకోవడం అసాధ్యం. విమానం ద్వారా వచ్చారనుకున్నా.. హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో అంత తక్కువసమయంలో చేరుకోవడం సాధ్యంకాదు. అంటే.. కేసు నమోదుకు ముందే ఓ బృందం హైదరాబాద్‌కు బయల్దేరి ఉంటుందని సైబరాబాద్‌ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగులను పోలీసులమని చెప్పుకుంటున్న వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లారంటూ సంస్థ డైరెక్టర్‌ అశోక్‌ హైకోర్టును ఆశ్రయించడం కూడా ప«థకంలో భాగంగానే జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు చెప్పడంతో ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ పాచిక పారనట్లయింది.

ఎవరా అధికారి?
తెలంగాణలో సైబర్‌ క్రైమ్‌లో ఉన్నత స్థానంలో పనిచేసి ప్రస్తుతం ఏపీలో ఉన్న అధికారి ఒకరికి ఈ కేసులో సంబంధం ఉందన్న విషయం కూడా కలకలం రేపుతోంది. ఈ లెక్కన ఈ కేసు వెనుక కేవలం రాజకీయ నాయకులే కాదు, అధికారుల అండదండలు కూడా ఉన్నాయన్న అనుమానంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే హార్డ్‌ డిస్కులను డీకోడ్‌ చేయడం ప్రారంభించిన అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

మత్తయ్య దారిలోనే అశోక్‌...
గతంలో ఓటుకు కోట్లు కేసు తరహాలోనే ఈ కేసు కూడా సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఆ కేసులో నిందితుడు మత్తయ్య విజయవాడకు పరారవడం, తరువాత ఆయన ఫిర్యాదు మేరకు తెలంగాణ సీఎంపై కేసు నమోదు చేయడం ఆగమేఘాల మీద జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అశోక్‌ తెలంగాణ పోలీసుల నోటీసులకు ఇంతవరకూ స్పందించలేదు. అంతేకాదు అశోక్‌ ఏపీలోనే ఉన్నాడంటూ మీడియాలో ప్రచారం జరగడం కూడా కలకలం రేపుతోంది. పైగా కేసును తెలంగాణ పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారు? వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వ పెద్దలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ తతంగమంతా చూస్తుంటే.. ఈ కేసులో నిందితులకు ఏపీలో అధికార టీడీపీ నుంచి అండదండలు దండిగా ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.

మరిన్ని వార్తలు