క్రాస్‌రోడ్స్‌లో కామ్రేడ్లు!

29 Jan, 2019 05:49 IST|Sakshi

ఎన్నికల వ్యూహాల్లో కుదేలైన సీపీఐ, సీపీఎం

’బీఎల్‌ఎఫ్‌’కులం ఉనికితో పోటీపై తమ్మినేని వైఖరి సరికాదన్న సీసీ

సొంత సీటు కోసం పార్టీకి నష్టం అంటూ చాడపై శ్రేణుల అసంతృప్తి

పార్టీలకు పట్టున్న చోట్లా గణనీయంగా ఓట్లు తగ్గడంపై ఆందోళన

రెండు విడతల పంచాయతీలోనూ నామమాత్రపు ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌: కమ్యూనిస్టు పార్టీలు పూర్వవైభవం సాధించడం సాధ్యమా? ‘గుర్తింపు సంక్షోభం’ఎదుర్కొంటున్న ఈ పార్టీలు మళ్లీ ఉనికి చాటుకుని రాజకీయాల్లో నిలవగలవా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలే కమ్యూనిస్టు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులను వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎంతోపాటు ఎన్నికల రాజకీయాల్లో ఉన్న ఎంఎల్‌ పార్టీలు సైతం ‘క్రాస్‌రోడ్స్‌’లో నిలిచి ఉన్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు విడివిడిగా ఎంచుకున్న ఎత్తుగడలు, వ్యూహాలు కుదేలయ్యాయి. కేవలం మూడుసీట్ల కోసం కాంగ్రెస్‌ ప్రజాఫ్రంట్‌లో సీపీఐ భాగస్వామి కావడం, తన సొంత సీటు కోసం పార్టీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తాపత్రయపడిన తీరుపై ఆ పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి.

సామాజిక న్యాయం, ప్రత్యామ్నాయ విధానాలతో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌(బీఎల్‌ఎఫ్‌) కూటమి పేరిట కులాల ప్రాతిపదికన అభ్యర్థులను పోటీకి నిలబెట్టడంపై పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనుసరించిన పద్ధతులను ఆ పార్టీ కేంద్ర కమిటీ ఓ నివేదికలో ఎండగట్టింది. వేర్వేరు పద్ధతులు అవలంబించినా కనీసం ఒక్కో సీటు అయినా గెలవకపోగా, కొన్నేళ్లుగా ఈ పార్టీలకు సంప్రదాయ ఓటింగ్‌గా ఉన్న చోట్ల కూడా పడాల్సిన ఓట్లు పడకపోవడంతో ఎన్నికల రాజకీయాల్లో ఈ పార్టీల పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. గత ఏడు దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ, ఏపీల్లో వామపక్షాలు ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయి...
కమ్యూనిస్టు పార్టీలు సిద్ధాంతాలు వదిలేసి, పచ్చి అవకాశవాద రాజకీయాలకు పాల్పడటం వల్లే ప్రస్తుతం ఈ దుస్థితి ఏర్పడింది. ఈ పార్టీల్లో ఉన్నటువంటి చాలా మంది నాయకులు డబ్బు, కుల ప్రభావం వంటి పలు బలహీనతలకు లోనవుతున్నారు. ఇక కొందరు నాయకులైతే అవకాశవాద రాజకీయాలు సైతం చేస్తున్నారు. మధ్యతరగతి అవకాశవాద రాజకీయాలనే ప్రధాన స్రవంతి రాజకీయాలుగా ఈ పార్టీల నాయకులు తీసుకొస్తున్నారు. 1990లో మొదలైన నయా ఉదారవాద విధానాలతో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఈ పార్టీలపైనా డబ్బు ప్రభావం పడింది. డబ్బులు లేకపోతే ఎన్నికల్లో గెలవమనే పరిస్థితులు కమ్యూనిస్టు పార్టీల్లోనూ ఏర్పడ్డాయి.   
– డి.పాపారావు, ఆర్థిక విశ్లేషకులు

కమ్యూనిస్టు పార్టీల ప్రతిష్ట దెబ్బతింది
పార్లమెంటరీ రాజకీయాల్లో కమ్యూనిస్టుపార్టీల ప్రతిష్ట దెబ్బతింది. ప్రత్యామ్నాయ సమాజాన్ని సృష్టించే దిశలో కృషి చేయాల్సిన వామపక్షాలకు ఆ స్వప్నమే కొరవడితే పరిస్థితులు మరో రకంగా మారతాయి. అధికార, బూర్జువా పార్టీలు ఎన్నికల రాజకీయాలను డబ్బు, కులం, ఇతర ప్రభావాలతో తమకు అనుకూలంగా మలుచుకోవడంతో 1970 దశకం నుంచి కమ్యూనిస్టుపార్టీల అస్తిత్వం తగ్గుముఖం పట్టడం మొదలైంది.    

– ప్రొ.జి.హరగోపాల్, పౌరహక్కుల నేత

సమస్యలపై పోరాటంలో విఫలం
ప్రజల మౌలిక సమస్యలపై పోరాడటంలో కమ్యూనిస్టు పార్టీలు విఫలమవుతున్నాయి. ప్రజల ఎజెండానే చేపడుతున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో సంబంధా లు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోతున్న రైతులు, ప్రజల సమస్యల లోతుల్లోకి వెళ్లలేకపోతున్నాయి. 1991 నుంచి నూతన ఆర్థికవిధానా లు, సంస్కరణల అమలు వల్ల జరిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించలేకపోయారు.  
 
 – జీవన్‌కుమార్, మానవహక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌)

మరిన్ని వార్తలు