ఓపీఎస్‌ అమలుచేసే పార్టీలకే ఓటు

5 Nov, 2018 02:49 IST|Sakshi

‘నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం’ తీర్మానం

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం (ఓపీఎస్‌) అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పే పార్టీలకే, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) ఉద్యోగులు ఓటు వేయాలని నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం (ఎన్‌ఎంఎఫ్‌ఓపీఎస్‌) తీర్మానం చేసింది. ఇందుకోసం ఐదు రాష్ట్రాల్లో చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అలాగే సీపీఎస్‌ రద్దుకోసం ఈనెల 26న ఢిల్లీలో ఉద్యోగుల భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది.

మూవ్‌మెంట్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి గంగాపురం స్థితప్రజ్ఞ అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లో ఎన్‌ఎంఎఫ్‌ఓపీఎస్‌ జాతీయ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మూవ్‌మెంట్‌ జాతీయ అధ్యక్షుడు వి.కె.బాందు మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దే లక్ష్యం గా ఉద్యోగులు పోరాటం చేయాలన్నారు. దీనిలో భాగంగా ఢిల్లీలో నిర్వహించే ర్యాలీకి అన్ని రాష్ట్రాల నుంచి సీపీఎస్‌ ఉద్యోగులు అధిక సం ఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

మూవ్‌మెంట్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, ఒకప్పుడు రూ.75 ఉన్న సామాజిక పెన్షన్లు రోజురోజుకు పెరిగాయని, ఎన్నికలు వచ్చాయంటే భారీగా పెంచుతున్నారన్నారు.  ప్రభుత్వ ఉద్యోగికి చివరి బేసిక్‌లో 50 శాతం, దానికి అప్పటి డీఏ కలుపుకొని వచ్చే సామాజిక భద్రతతో కూడిన పెన్షన్‌ ఇపుడు రూ. 550కు పడిపోయిందన్నారు.

తెలంగాణలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో సీపీఎస్‌ అభ్యర్థులను పోటీలో నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కోర్‌ కమిటీ సభ్యులు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన నరేశ్‌ ఠాగూర్, కర్ణాటక నుంచి శాంతారాం, ఏపీ నుంచి రామాంజనేయులు, తెలంగాణ నుంచి సీపీఎస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు