రైతుల ఆందోళనలు పట్టని టీఆర్‌ఎస్‌

15 Feb, 2018 04:48 IST|Sakshi
కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, బలరాం నాయక్‌

మద్దతు ధర కోసం వైఎస్‌ హయాంలో చర్యలు: మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: వ్యాపారులతో కుమ్మక్కయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర దక్కకుండా అన్యాయం చేస్తూనే, కాంగ్రెస్‌పై నెపం మోపేందుకు యత్నిస్తున్నాయని అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి ఆరోపించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు ఇబ్బంది పడుతూ రాష్ట్రంలో రోడ్లెక్కుతున్నా, ఎర్రజొన్న, పసుపు రైతులు 15 రోజులుగా ధర్నాలు చేస్తున్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మరో నేత రాజారాంయాదవ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు.

రైతుల మద్దతు ధర కోసం రూ.2 వేల కోట్లు బడ్జెట్‌లో పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన టీఆర్‌ఎస్‌ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పెట్టలేదని విమర్శించారు. రైతుల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎంతో చేసిందని చెప్పారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీవో 153 ద్వారా రూ.30 కోట్లు విడుదల చేశామని, రూ.11 కోట్లను ట్రేడర్స్‌ యాక్ట్‌ కింద ఇచ్చామని, రైతులపై కాంగ్రెస్‌ ప్రేమకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల కోసం టీఆర్‌ఎస్‌ ఏం చేసిందో చెప్పాలని ఆయన సవాల్‌ చేశారు.  

కల్తీ విత్తనాల వెనుక ఎమ్మెల్సీ హస్తం
కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని, దీని వెనుక అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్సీ హస్తం ఉందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ బుధవారం ఆరోపించారు. నకిలీ విత్తనాల గుట్టు తేల్చి అసలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులకు పంపిణీ చేసిన పోడు భూములను అటవీ అధికారులు బలవంతంగా లాక్కుంటున్నా సీఎం కేసీఆర్‌ అధికారులనే వెనకేసుకురావటం బాధాకరమన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. పోడు భూములు లాక్కోవడంతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు.  

మరిన్ని వార్తలు