ఆదాలకు కోపమొచ్చింది!

6 Feb, 2019 13:20 IST|Sakshi

అంతా సోమిరెడ్డి ఇష్టమేనా

టికెట్లు కూడా మీరే ఇచ్చేస్తారా..

సీఎం వద్ద తేల్చుకుంటా..

మంత్రి నారాయణతో ఆదాల అసంతృప్తి

జిల్లా అధ్యక్షుడు బీద తీరుపై అసహనం

మళ్లీ ఆదాలతో మంత్రి నారాయణ, బీద భేటీ

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మళ్లీ ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీరుపై మరో మంత్రి నారాయణ వద్ద మండిపడ్డారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అయిన తనకుతెలియకుండా నెల్లూరు రూరల్‌ సమావేశం ఎలా నిర్వహిస్తారని, అంత హడావుడిగా సమావేశం జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంగళవారం రాత్రి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి నివాసంలో  మంతనాలు జరిపారు. ఈ నెల 9న నెల్లూరు నగరంలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించుకుంటున్నామని నేతలు చెబుతున్నప్పటికీ జిల్లాలో అధికారపార్టీ అభ్యర్థులు, టిక్కెట్ల వ్యవహారంపై మంతనాలు సాగిస్తుండడం గమనార్హం. మరోవైపు గతంలో తాను నెల్లూరు పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లిలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం బలంగా సాగింది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆదాల ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై సృష్టత లేదు. దీంతో మంత్రి నారాయణ, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రలు వరుసగా సోమ, మంగళవారాల్లో జరిగిన భేటీలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపైనే చర్చ సాగినట్లు సమాచారం.

సోమిరెడ్డికి రూరల్‌లో ఏం పని?
వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సోమవారం నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించారు. దీనికి నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నేత తాళ్లపాక అనురాధ హాజరయ్యారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కసరత్తు చేస్తున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంతో ఏం పని ఉందంటూ మాజీ మంత్రి ఆదాల జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రను ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా రూరల్‌ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా ఉండి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆయన సమావేశాలు నిర్వహించడం, హడావుడి చేయడం ఏంటని నిలదీశారు. వీటన్నింటిపై సీఎంతో మాట్లాడి ఆయన వద్దే తేల్చుకుంటానని చెప్పినట్లు సమాచారం. జిల్లాలో టిక్కెట్లు కూడా మంత్రి సోమిరెడ్డి, మరికొంత మంది ఇచ్చేట్లు మాట్లాడుతూ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని, రోజుకో నేత నెల్లూరు రూరల్‌ నుంచి పోటీ చేస్తారని వారే ప్రచారం చేస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని సీఎం పర్యటన సమయంలో నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గంపై సమావేశం నిర్వహించాలని కోరి అప్పుడే అన్నీ తేల్చుకుంటానని ఆదాల సృష్టం చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు