కోవూరు టీడీపీలో ముసలం

17 Jul, 2018 13:23 IST|Sakshi

పోలంరెడ్డి తీరుపై రాష్ట్ర కార్యాలయానికి కోవూరు టీడీపీ నేతల ఫిర్యాదు

16 మంది బూత్‌ కన్వీనర్లు తొలగింపు

ఎమ్మెల్యే అనుకూల కార్యకర్తల నియామకంపై మండిపాటు

నెల్లూరు (టౌన్‌)/కోవూరు:  కోవూరు టీడీపీలో ముసలం రేగింది. ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి మధ్య ఉన్న వివాదం తారాస్థాయికి చేరింది. కోవూరు మండలంలో చేజర్ల వర్గానికి చెందిన 16 మంది బూత్‌ కన్వీనర్లను తొలగించిన పోలంరెడ్డి తనకు అనుకూలమైన కార్యకర్తలను నియమించుకున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ నేతలు పోలంరెడ్డిపై గుర్రుగా ఉన్నారు. పోలంరెడ్డి తీరుపై రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. మంగళవారం నుంచి ఎమ్మెల్యే పోలంరెడ్డి కార్యక్రమాలను బహిష్కరించాలని చేజర్ల వర్గం నిర్ణయించుకుంది.

కోవూరు మండలంలో మొత్తం 62 మంది బూత్‌ కన్వీనర్లు ఉన్నారు. వీరిలో చేజర్లకు వర్గానికి చెందిన 16 మందిని ఎమ్మెల్యే పోలంరెడ్డి తొలగించి వారి స్థానంలో తమకు అనుకూలంగా ఉన్న వారిని ఆ స్థానంలో నియమించారు. ఈ పరిణామాలతో ఎదురుదాడి చేయాలని చేజర్ల వర్గం సిద్ధమైంది. సాధారణంగా బూత్‌ కన్వీనర్లను మార్చే సమయంలో ఆ మండలంలో అందరి నాయకులు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే పార్టీ సీనియర్‌ నాయకులను పక్కన బెట్టి ఎమ్మెల్యే నేరుగా ఎలా నియమిస్తారని ఆ పార్టీ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు.  

ఎమ్మెల్యే కార్యక్రమాలు బహిష్కరించాలని నిర్ణయం
మంగళవారం కోవూరు మండలం మోడేగుంటలో జరిగే గ్రామ దర్శిని, గ్రామ వికాసం కార్యక్రమానికి మండల టీడీపీ నాయకులు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశారు. వెంటనే రాష్ట్ర పార్టీ కార్యాలయం నేతలు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర దృష్టికి ఈ సమస్యను తీసుకువచ్చి వెంటనే పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిసింది. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా బీద నుంచి కోవూరు మండల నాయకులకు పిలుపు వచ్చింది. తిరిగి 16 మంది బూత్‌ కన్వీనర్లను తీసుకుంటే గ్రామ దర్శిని, గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొంటామని లేకుంటే బహిష్కరిస్తామని మండల నాయుకులు తెగేసి చెబుతున్నారు.

మరిన్ని వార్తలు