ఫ్యామిలీ ‘వార్‌’

24 Apr, 2018 07:38 IST|Sakshi
వెట్రివేల్‌ , దినకరన్‌ , దివాకరన్‌

మేనమామతోమేనల్లుడు ఢీ

చిన్నమ్మ కుటుంబంలో రచ్చ

వెట్రివేల్‌ ట్వీట్‌తోతెర మీదకు

చిన్నమ్మ శశికళ కుటుంబంలోఅంతర్యుద్ధం తెర మీదకు వచ్చింది.మేనమామ దివాకరన్‌ను ఢీకొనేందుకు మేనల్లుడు దినకరన్‌ సిద్ధం అయ్యారు.ఈ ఇద్దరి మధ్య చాపకింద నీరులా సాగుతూ వచ్చిన ఇంటిపోరు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే వెట్రివేల్‌ ట్వీట్‌ రూపంలో తాజాగా వెలుగులోకి వచ్చింది.

సాక్షి, చెన్నై :  దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ కుటుంబం నుంచి వార్తల్లో వ్యక్తులుగా శశికళ సోదరుడు దివాకరన్, అన్న జయరామన్‌ పిల్లలు వివేక్, కృష్ణప్రియ, అక్క వనితామణి కుమారుడు దినకరన్‌ ఉంటున్నారు. చిన్నమ్మ జైలు జీవితం తదుపరి కుటుంబానికి పెద్ద దిక్కుగా దివాకరన్, రాజకీయ ప్రతినిధిగా దినకరన్‌ అడుగులు వేస్తున్నారు. ఆస్తుల పంపకాల వ్యవహారం కుటుంబంలో అంతర్యుద్ధానికి దారితీసినట్టు కొంత కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శిగా, చిన్నమ్మ ప్రతినిధిగా దినకరన్‌ రాజకీయ బలోపేతం కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. అదే సమయంలో కుటుంబం వ్యక్తుల నిర్వహణలో ఉన్న సంస్థల్లో దినకరన్‌ జోక్యం వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నట్టు సమాచారం. దీంతో ఎవరికి వారు అన్నట్టు ముందుకు సాగుతుండడం జైల్లో ఉన్న చిన్నమ్మను కుంగదీస్తున్నట్టు తెలిసింది.

భర్తమరణంతో పెరోల్‌ మీద వచ్చిన సమయంలో ఈ విభేదాలు చిన్నమ్మను ఉక్కిరిబిక్కిరి చేయడంతోనే ముందస్తుగానే ఆమె జైలుకు వెళ్లినట్టుగా మద్దతుదారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరెన్ని వివాదాలు సృష్టించినా, ఒత్తిడి తెచ్చినా చిన్నమ్మ మాత్రం దినకరన్‌కు అండగా నిలబడ్డట్టు చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఫేస్‌బుక్‌లో చిన్నమ్మ విశ్వాసపాత్రుడు, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే వెట్రివేల్‌ పోస్టుచేసిన ఓ ట్వీట్‌ ఫ్యామిలీ వార్‌ను తెర మీదకు తీసుకొచ్చింది.

వెట్రివేల్‌ ట్వీట్‌
దివాకరన్‌ ఎవరికో వత్తాసు పలికే రీతిలో స్పందించడం మొదలెట్టినట్టుందని వెట్రివేల్‌ ట్విట్టర్‌లో విమర్శించారు. స్వలాభం కోసం పాకులాడవద్దని పరోక్షంగా దివాకరన్‌కు హెచ్చరించారు. తమలో గందరగోళ పరిస్థితుల్ని సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని చురకలంటించారు. సీఎం ఎడపాడి పళనిస్వామి మద్దతుదారుడు ఛత్రపతి శివగిరి ద్వారా అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్పందించడం మొదలెట్టినట్టుందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా చిన్నమ్మ బలాన్ని, దినకరన్‌ ఎదుగుదలను అడ్డుకోలేరని హెచ్చరించారు. దినకరన్‌ బలాన్ని నీరుగార్చేందుకు కొత్త ప్రయత్నాల్లో పడ్డట్టు స్పష్టం అవుతోందన్నారు.

రాజకీయ తెరపైకి జయ ఆనందన్‌
దినకరన్‌ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న దివాకరన్‌ చిన్నమ్మ ప్రతినిధిగా తన కుమారుడు జయ ఆనందన్‌ను రాజకీయ తెరపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దినకరన్‌ను దెబ్బతీయడానికి ఆయన అధికార పక్షంతో చాపకింద నీరులా ఒప్పందాలు చేసుకున్నట్టు చర్చ సాగుతోంది. అలాగే, దినకరన్‌ వెన్నంటి నడిచేందుకు సిద్ధంగా ఉన్న మరో ఐదుగురు ఎమ్మెల్యేల గురించి వివరాలను దివాకరన్‌ శిబిరం సీఎంకు లీక్‌ చేసినట్టు ప్రచారం ఊపందుకుంది. ఈ సమయంలో రెండు రోజుల క్రితం ఆయన సీఎం పళనిస్వామికి అనుకూలంగా ఉన్న వారితో సంప్రదింపులు సాగించినట్టు సమాచారం. చిన్నమ్మను త్వరితగతిన జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తానని, అనర్హత వేటు పడ్డ వారితో పాటు 21 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నట్టు వ్యాఖ్యానించినట్టు ప్రచారం ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబంలో సాగుతున్న వివాదాలను తేటతెల్లంచేస్తూ, దివాకరన్‌కు చురకలు అంటించే విధంగా వెట్రివేల్‌ ట్వీట్‌ చేయడం చర్చకు దారితీసింది. మేనమామను ఢీకొట్టేందుకు దినకరన్‌ రెడీ అన్నట్టుగా  స్పందించడమే కాదు.. తామెప్పుడు చిన్నమ్మ మద్దతుదారులే గానీ, దివాకరన్‌కు కాదు అని స్పష్టం చేయడం గమనార్హం.

మేమంతా వారివెంటే..
అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు అందరూ ఒకే నినాదంతో చిన్నమ్మే ప్రధాన కార్యదర్శిగా, దినకరన్‌ ఉప ప్రధాన కార్యదర్శిగా ముందుకు సాగుతామని వెట్రివేల్‌ స్పష్టంచేశారు. తమ పయనం శశికళ, దినకరన్‌ల వెంటే అని, మరెవరి వెనుక నడవాల్సిన అవసరం తమకు లేదని దివాకరన్‌ను ఉద్దేశించి తీవ్రంగా స్పందించడం గమనార్హం. రాజకీయంగా దినకరన్‌ బలపడుతుండడంతోనే, తన కుమారుడి భవిష్యత్తు దృష్ట్యా, దివాకరన్‌ కొత్త ప్రయత్నాలకు సిద్ధపడ్డ విషయం అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాల దృష్టికి చేరినట్టు తెలిసింది. తాజా పరిస్థితులతో ఢీకి రెడీ అన్నట్టుగా వ్యూహంతో వెట్రివేల్‌ ద్వారా మేనమామకు  దినకరన్‌ చెంపపెట్టు సమాధానం ఇచ్చినట్టు చర్చ ఊపందుకుంది. 

>
మరిన్ని వార్తలు