కశ్మీర్‌లో తీవ్ర గందరగోళం: రాఘవులు

22 Jun, 2018 17:03 IST|Sakshi

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌ పాలనలో తీవ్ర గందరగోళం నెలకొందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశంలో భాగంగా కశ్మీర్‌ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు వెల్లడించారు. దేశ న్యాయవ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని, కొలీజియం సూచించిన వ్యక్తిని సుప్రీం కోర్టు జడ్జిగా నియమించకుండా కేంద్రం జాప్యం చేస్తోందని చెప్పారు.

న్యాయవ్యవస్థలో వివాదాలకు తావులేకుండా జాతీయ జ్యూడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని తెలిపారు. రైతాంగం సమస్యల మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి, రైతుల దుస్థితిని ఇంకా పెంచుతుందని ఆవేదన​ వ్యక్తం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 8న కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలసి ఛలో పార్లమెంటు నిర్వహించాలని పిలుపునిచ్చారు. త్రిపుర, బెంగాల్, కేరళ రాష్ట్రాలలో పరిస్థితులు గురించి కూడా కేంద్ర కమిటీ సమీక్షించినట్లు తెలిపారు.

ఆరెస్సెస్‌, సంఘ్‌ పరివార్‌లు సీపీఎంను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అందులో భాగంగానే సీపీఎం కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈ దాడులను ఖండించాలని కోరారు. 2019 సాధారణ ఎన్నికల ఎత్తుగడలు గురించి వచ్చే సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఫెడరల్‌ ఫ్రంట్‌ అన్నారని, ఇంతవరకూ ఆ ఊసే లేదని చెప్పారు. బీజేపీ, ఏఏపీపై వ్యవహరించిన తీరును కేసీఆర్‌ ఖండించి ఉంటే బావుండేదని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన నిరసన దీక్షకు కేసీఆర్ మద్దతు ఇచ్చింటే బావుండేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కలిసి ఉందని ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదని అన్నారని, మరి కేజ్రీవాల్‌కు ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నంత మాత్రాన లాభం చేకూరదని కేసీఆర్ గమనించాలని హితవు పలికారు.

>
మరిన్ని వార్తలు