రాజీనామా చేస్తా.. వద్దు వద్దు..!

25 May, 2019 02:36 IST|Sakshi

కుమారస్వామి నాయకత్వంపై విశ్వాసం ప్రకటించిన కేబినెట్‌

బెంగళూరు: ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి నాయకత్వంపై తమకు విశ్వాసం, నమ్మకం ఉన్నాయని కర్ణాటక కేబినెట్‌ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో శుక్రవారం మంత్రివర్గం సమావేశమై సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకా లేదని తెలిపింది. ‘కుమారస్వామి నాయకత్వంపై మేం విశ్వాసం, నమ్మకం వ్యక్తం చేశాం. ప్రభుత్వ మనుగడకు ఎటువంటి ప్రమాదం లేదు’ అని శుక్రవారం కేబినెట్‌ భేటీ అనంతరం డిప్యూటీ సీఎం పరమేశ్వర మీడియాకు తెలిపారు.

ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని, తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని అంటూ ఆయన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సాగనీయబోమని పరమేశ్వర ప్రకటించారు. మీడియాను బహిష్కరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సీఎం కుమారస్వామి పరమేశ్వరతోపాటు మీడియా సమావేశంలో పాల్గొన్నప్పటికీ మౌనంగా కూర్చుని ఉన్నారు. ఓటమికి కారణం జేడీఎస్‌తో పొత్తేనంటూ కాంగ్రెస్‌ నేతల నుంచి విమర్శలు రావడంతో రాజీనామాకు సిద్ధమంటూ సీఎం కుమారస్వామి గురువారం ప్రకటించారు. అయితే, కాంగ్రెస్‌ నేతలు ఆయనకు సర్దిచెప్పడంతో వెనక్కి తగ్గారని సమాచారం. గురువారం వెలువడిన ఫలితాల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్‌ 1, జేడీఎస్‌ 1 స్థానం మాత్రమే దక్కించుకోగా 25 చోట్ల బీజేపీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.   

ఎంపీ సీటును దేవెగౌడకు త్యాగం చేస్తా
ఎంపీ, మనవడు ప్రజ్వల్‌ ప్రకటన
సాక్షి బెంగళూరు: తుమకూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధ్యక్షుడు దేవెగౌడ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవెగౌడ మనవడు, హసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ సంచలన ప్రకటన చేశారు. హసన్‌ లోక్‌సభ స్థానాన్ని తాతయ్య దేవెగౌడ కోసం వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు.ఈ విషయమై ఇంకా తాతయ్యతో చర్చించలేదు. కానీ హసన్‌ నుంచి పోటీచేసే విషయమై ఆయన్ను ఒప్పిస్తా’ అని బెంగళూరులో మీడియాతో అన్నారు.

మరిన్ని వార్తలు