మోదీపై పోటీగా అజయ్‌రాయ్‌

26 Apr, 2019 02:48 IST|Sakshi

ప్రియాంక పోటీపై ఊహాగానాలకు తెర

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రధాని మోదీతో ప్రియాంక గాంధీ తలపడతారనే ఊహాగానాలకు తెరపడింది. తమ అభ్యర్థిగా వారణాసికి చెందిన అజయ్‌ రాయ్‌ను కాంగ్రెస్‌ ప్రకటించింది. 2014 ఎన్నికల్లో మోదీపై పోటీ చేసిన రాయ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ కేజ్రీవాల్‌ తర్వాత మూడో స్థానంలో నిలిచారు. ప్రియాంక వారణాసి నుంచి మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతారనే ఊహాగానాలు గత కొద్ది వారాలుగా కొనసాగాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌.. తన సోదరి మోదీతో తలపడటంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ..‘మిమ్మల్ని సస్పెన్స్‌లో పెడుతున్నాను. సస్పెన్స్‌ అనేది ఎప్పుడూ చెడు విషయమే కానక్కర్లేదు..’అని చెప్పడం ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

యావత్‌ దేశానికి ప్రియాంక నాయకత్వం అవసరం
వారణాసి నుంచి ప్రియాంకను పోటీకి నిలపకపోవడంపై అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రజనీ నాయక్‌ సమాధానమిస్తూ.. ‘అభ్యర్థులను బరిలోకి దింపే విషయంలో మాకో ప్రక్రియ, ఓ విధానం అంటూ ఉన్నాయి. మొత్తం ఉత్తరప్రదేశ్‌కు, అలాగే యావత్‌ దేశానికి ప్రియాంక నాయకత్వం అవసరమని మేము విశ్వసిస్తున్నాం..’అని ఆమె చెప్పారు. కాగా, వారణాసి నుంచి శాలినీ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ బరిలో దింపుతోంది. తమ పార్టీ గోరఖ్‌పూర్‌ అభ్యర్థిగా మధుసూదన్‌ తివారీని కాంగ్రెస్‌ ప్రకటించింది.  
 

ఐదు సార్లు ఎమ్మెల్యే
మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అజయ్‌ రాయ్‌కు వారణాసి ప్రాంతంలో మంచి పట్టుంది. బీజేపీ విద్యార్థి విభాగం సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించి.. ఆ పార్టీ తరఫున వరసగా మూడుసార్లు కొలసల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీ లోక్‌సభ టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో 2009 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2012 ఎన్నికల సమయంలో ఆయన 16 క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. గ్యాంగ్‌స్టర్, గూండా చట్టాల కింద కూడా బుక్‌ అయ్యారు.  

మరిన్ని వార్తలు