-

కర్ణాటకంలో కాంగ్రెస్‌ దూకుడు

20 May, 2018 03:16 IST|Sakshi

కర్ణాటక రాజకీయ క్రీడలో ప్రస్తుతానికి కాంగ్రెస్‌ విజయం సాధించింది. గోవా, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినా.. అధికారం చేపట్టలేకపోయిన వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకున్న కాంగ్రెస్‌.. కర్ణాటకలో తమ వ్యూహాలను పకడ్బందీగా అమల్లో పెట్టింది. ప్రచారంలోనూ దూకుడుగా వ్యవహరించిన కాంగ్రెస్‌.. విజయంపై తొలి నుంచి ధీమాగానే ఉంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడానికి ముందే ప్రచార రంగంలోకి దూకింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పలు దఫాలుగా రాష్ట్రాన్ని చుట్టేశారు. మరోవైపు సిద్దరామయ్య ఇమేజ్, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అంతగా లేని వ్యతిరేకత తమకు కలసి వస్తాయని కాంగ్రెస్‌ ఆశించింది.

రాహుల్‌ దేవాలయాల సందర్శన, లింగాయత్‌లకు మైనారిటీ హోదా.. తదితరాలు కూడా ఓట్లు కురిపిస్తాయనుకుంది. కానీ ఫలితాలు వేరుగా వచ్చాయి. సాధారణంగా అయితే, ఓటమిని అంగీకరించి, మౌనంగా ఉండే కాంగ్రెస్‌.. ఈసారి ఊహించని దూకుడును ప్రదర్శించింది. ఫలితాలు వెలువడుతుండగానే రంగంలోకి దిగింది. రాహుల్‌ ఇంట్లో జరిగిన ‘లంచ్‌ మీట్‌’లో ప్లాన్‌ బీని సిద్ధం చేసింది. ఫలితాలకు ముందు రోజే బెంగళూరు చేరుకున్న ఆజాద్‌ ద్వారా జేడీఎస్‌తో రాయబారం నడిపింది. ప్రభుత్వ ఏర్పాటులో కలసి నడుద్దామని, జేడీఎస్‌కు మద్దతిచ్చేందుకు సిద్దమని సమాచారం పంపింది. సీఎంగా కుమారస్వామి ఉంటారన్న డిమాండ్‌ సహా జేడీఎస్‌ నుంచి వచ్చిన డిమాండ్లకు వెంటనే ఆమోదం తెలిపింది. సీనియర్‌ నేతలు ఆజాద్, అశోక్‌ గెహ్లాట్‌లు స్వయంగా కాంగ్రెస్‌ ప్రణాళికను దగ్గరుండి మరీ అమలు చేసేలా చూసింది. ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో గవర్నర్‌ వద్దకు కుమారస్వామితో పాటు ఆజాద్‌నూ పంపించింది.

లాస్ట్‌ ‘రిసార్ట్‌’..: ఇప్పుడు తమ ఎమ్మెల్యేలతో పాటు జేడీఎస్‌ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కాంగ్రెస్‌కు ప్రధాన సమస్యగా మారింది. ఎమ్మెల్యేలు చేజారకుండా రిసార్ట్‌ రాజకీయాలకు తెరలేపింది. ఇలాంటి విషయాల్లో అనుభవజ్ఞుడైన కర్ణాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌కు ఈ బాధ్యతను అప్పగించింది. తొలుత బెంగళూరు శివార్లలోని ఈగల్‌టన్‌ రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను భద్రంగా దాచిన శివకుమార్, మరింత భద్రత కోసం అనూహ్యంగా కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలించి, బలపరీక్ష రోజే(శనివారం) అసెంబ్లీకి చేరుకునేలా ప్రణాళిక రచించారు. అంతకుముందు, వారిని కొచ్చికి తరలిస్తున్నట్లుగా లీకులిచ్చి, గందరగోళం సృష్టించారు. ‘మిస్‌’ అయిన ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆనంద్‌ సింగ్, ప్రతాప గౌడను కూడా మళ్లీ సొంత గూటికి తెచ్చారు. ఇలా అనూహ్యంగా దూకుడుగా వ్యవహరించిన కాంగ్రెస్‌ మొత్తానికి బీజేపీకి చెక్‌ పెట్టింది. ఈ మొత్తం వ్యూహాన్ని సోనియా గాంధీ, రాహుల్‌ సోదరి ప్రియాంక వాద్రా కూడా స్వయంగా పర్యవేక్షించారు.
 
కోర్టులోనూ క్రియాశీలకంగా..
యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించిన తరువాత కూడా కాంగ్రెస్‌ శీఘ్రంగా స్పందించింది. పార్టీ సీనియర్‌ నేతలు, ప్రముఖ న్యాయవాదులైన అభిషేక్‌ మను సింఘ్వీ, చిదంబరంలను రంగంలోకి దింపింది. యడ్యూరప్పను ఆహ్వానించడాన్ని, బలనిరూపణకు 15 రోజుల గడవు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో ప్రశ్నించింది. బుధవారం అర్ధరాత్రే సుప్రీంకోర్టు తలుపు తట్టి, తమ పిటిషన్‌ను విచారించాలని కోరింది. దాంతో అప్పటికప్పుడు  చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన వాదనలు తెల్లవారే వరకు నడిచాయి. కానీ యెడ్డీ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆ తరువాత ఇరుపక్షాల వాడీవేడి వాదనల అనంత రం ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. గవర్నర్‌ ఇచ్చిన 15 రోజుల గడువును పక్కనబెట్టి, శనివారం సాయంత్రం 4 గంటలకు విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని యడ్యూరప్పను ఆదేశించింది. ఈ తీర్పు కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

– సాక్షి నేషనల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు