బోర్డర్‌లో బ్యాటిల్‌

23 Mar, 2019 08:53 IST|Sakshi

భారత్‌–పాక్‌ సరిహద్దు నియోజకవర్గాల్లో ఎన్నికల యుద్ధం

కాంగ్రెస్, భాగస్వామ్య పక్షాలు– బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌ ఢీ

సరిహద్దుల్లో ఎన్నికల యుద్ధమేఘాలు కమ్మకున్నాయి. రానున్న సాధారణ ఎన్నికల్లో పంజాబ్‌కి ఆనుకొని ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లోని పార్లమెంటరీ స్థానాల్లో హోరాహోరీ ఎన్నికల పోరు జరగనుంది. భారత్‌–పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలూ, కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రాజెక్టు నిర్మాణం, పంథిక్‌ (మతపరమైన) ఓటుబ్యాంకు చీలిక.. వెరసి బద్ధ శత్రువులైన కాంగ్రెస్, దాని భాగస్వామ్య పక్షాలు.. బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌ కూటమిని ఢీకొట్టనున్నాయి. దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాల రీత్యా గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్, ఖదూర్‌ సాహిబ్‌ నియోజకవర్గాలలో అభ్యర్థులను నిర్ణయించే పనిలో నిమగ్నమయ్యాయి.

పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న సిక్కుల ప్రార్థనా స్థలాన్ని గురుదాస్‌పూర్‌లోని డేరా బాబానానక్‌ ప్రార్థనాలయాన్ని కలిపే ప్రతిపాదిత రహదారి నిర్మాణంపై పాకిస్తాన్‌తో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ గురుదాస్‌పూర్‌ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సరిహద్దుల్లో ఎన్నికల యుద్ధానికి తెరతీశాయి. ఇక్కడ అభ్యర్థిగా ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సునీల్‌ జకార్‌ను ముఖ్యమంత్రి ప్రకటించారు. బీజేపీ.. ఒకనాటి సినీ రంగ ప్రముఖుడు వినోద్‌ ఖన్నా కుమారుడు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ఖన్నాను నిలబెట్టాలని సన్నాహాలు చేస్తోంది. హైకమాండ్‌ అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గురుదాస్‌పూర్‌ అభ్యర్థిని ప్రకటించడం అపరిపక్వతతో కూడుకున్న చర్య అని గురుదాస్‌పూర్‌ మాజీ ఎంపీ, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పర్దాబ్‌ సింగ్‌ బాజ్వా ముఖ్యమంత్రిపై కత్తులు దూశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమృత్‌సర్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి అమరేందర్‌ సింగ్‌ చేతిలో బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ స్థానంలో దీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.

తెరపైకి పూనమ్‌ థిల్లాన్‌..
మొదట ఆపరేషన్‌ బ్లూ స్టార్‌కు నిరసనగా పదవికి రాజీనామా చేసిన మాజీ దౌత్యవేత్త, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఫిరాయింపుదారుడు హరీందర్‌సింగ్‌ ఖల్సా, మరో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఫిరాయింపుదారుడైన సీనియర్‌ న్యాయవాది హెచ్‌ఎస్‌ ఫుల్కాని పోటీకి నిలబెట్టాలని కూడా బీజేపీ ఆలోచించింది. అనూహ్యంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ సినీనటి పూనమ్‌ థిల్లాన్‌ని తెరపైకి తెచ్చింది ఆ పార్టీ. 2004లోనే బీజేపీలో చేరిన పూనమ్‌ ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీలో చురుకైన కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ముంబై యూనిట్‌కి ఉపాధ్యక్షురాలిగానూ ఉన్నారు. చంఢీగఢ్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్యానల్‌ సభ్యుల సమావేశంలో పంజాబ్‌ బీజేపీ చీఫ్‌ శ్వేత్‌ మలిక్‌..  పూనమ్‌ థిల్లాన్‌ పేరుని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ ఈమె పేరు ప్రస్తావనకు రాకపోవడంతో మిగిలిన కమిటీ సభ్యులను ఈ ప్రతిపాదన ఆశ్చర్యంలో ముంచెత్తింది. 2014లో జరిగిన అమృత్‌సర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టికెట్‌ కోసం ప్రయత్నించిన రాజీందర్‌ మోహన్‌ సింగ్‌ చిన్నా పేరును కూడా ఎన్నికల ప్యానల్‌ సూచించింది. అయితే ఒకనాటి కుర్రకారు కలలరాణి పూనమ్‌ థిల్లాన్‌ అభ్యర్థిత్వమే ఖరారు కానున్నట్టు తెలుస్తోంది.  

పలువురి పేర్లు షికారు..
రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కెప్టెన్‌ అభిమన్యు రాష్ట్ర ఎన్నికల ప్యానల్‌ ప్రతిపాదిత అభ్యర్థుల పేర్లను మార్చి 22న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకి పంపనున్నారు. ఇంతకు ముందు క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ పేరు సైతం వినిపించినా ఈ సమావేశంలో మాత్రం ఆ పేరు చర్చకి రాలేదు. ఈ స్థానానికి కేంద్ర గృహæనిర్మాణ పట్టణాభివృద్ధి సహాయ మంత్రి హర్దిప్‌ పురి పేరు కూడా షికారు చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పెద్ద తలకాయల కోసం గాలిస్తోంది. ఈ స్థానంలో పోటీచేయాలంటూ అధిష్టానం చేసిన ప్రతిపాదనను మన్మోహన్‌ సింగ్‌ తిరస్కరించారు. అమరేందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి అయ్యాక 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో గురుజీత్‌ సింగ్‌ ఔస్‌లా విజయం సాధించారు. ఈ స్థానంలో వరుసగా రెండుసార్లు గెలిచిన క్రికెటర్‌ నవజోత్‌సింగ్‌ సిద్ధూ పార్టీ ఫిరాయించి, కాంగ్రెస్‌లో చేరి ప్రస్తుతం ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

పంథిక్‌ ఓటు బ్యాంకుపై కన్ను
పంజాబ్‌ అంతర్జాతీయ సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ఖదూర్‌ సాహిబ్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో పంథిక్‌ ఓటు బ్యాంకుపై శిరోమణి అకాలీదళ్‌ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం యత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ ఓటుబ్యాంకు తుడిచిపెట్టుకుపోయింది. అకాలీదళ్‌కి బలమున్న ఈ ప్రాంతంలోకి ఆమ్‌ ఆద్మీ పార్టీ చొచ్చుకొచ్చింది. శిరోమణి అకాలీదళ్‌ పాలనలో వారు చేసిన తప్పుడు పనులు, హింసపై జరుగుతున్న న్యాయ విచారణ ఎస్‌ఏడీని వెనకడుగు వేసేలా చేస్తోంది. శిరోమణి అకాలీదళ్‌ ఖదూర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి మాజీ మతగురువు, శిరోమణి గురుద్వార ప్రబంధ కమిటీ (ఎస్‌జీపీసీ) అ«ధినేత జాగీర్‌కౌర్‌ని నిలబెట్టింది. 2012లో తన కూతురి బలవంతపు గర్భస్రావం, ఆమె అనుమానాస్పద మృతి విషయంలో రెండుసార్లు ఎస్‌జీపీసీ ముఖ్య మతగురువుగా ఉన్న కౌర్‌కు సీబీఐ ఐదేళ్ల శిక్ష విధించింది. అయితే, గత సంవత్సరం పంజాబ్, హరియానా హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ఈ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రతన్‌సింగ్‌ అజనాల, ప్రస్తుత ఎంపీ రంజిత్‌సింగ్‌ బ్రహ్మపుర పార్టీని వీడి సొంత పార్టీని స్థాపించుకున్నారు.

ఫిరోజ్‌పూర్‌లో ధీటైన అభ్యర్థి కోసం..
మరో సరిహద్దు నియోజకవర్గమైన ఫిరోజ్‌పూర్‌లో ప్రస్తుత ఎంపీ, శిరోమణి అకాలీదళ్‌కి చెందిన షేర్‌సింగ్‌ ఘుభాయా పార్టీ ఫిరాయించాక కాంగ్రెస్‌ విజ యంపై నమ్మకంతో ఉంది. తన కంచుకోట అయిన ఫిరోజ్‌పూర్‌ను కాపాడుకోవడానికి శిరోమణి అకాలీదళ్‌ ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నది. ప్రస్తుత కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రి హర్‌సిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌ ఈ స్థానం నుంచి పోటీ చేయవచ్చని వినిపిస్తోంది. కాంగ్రెస్‌ ఇక్కడి నుంచి పంజాబ్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌ బాదల్‌ను నిలబెట్టాలని యోచిస్తోంది. ఈ రెండు పార్టీ లూ అభ్యర్థులను ఒకరు ప్రకటించాక మరొకరు ప్రకటించాలని చూస్తు్తన్నాయి.  

మరిన్ని వార్తలు