ఉత్తరాన పొత్తు కుదిరింది!

9 Sep, 2019 11:29 IST|Sakshi

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా కాంగ్రెస్‌-బీఎస్పీ

మాయావతితో భేటీ అయిన హస్తం నేతలు

చండీగఢ్‌: సార్వత్రిక ఎన్నికలు ముగిసి దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి తగ్గినా..  ఉత్తర భారతంలోని హర్యానాలో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల జరుగనున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారమే హర్యానాలో పర్యటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరోవైపు పొత్తులపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. దీనిలో భాగంగానే బీఎస్పీతో పొత్తుకు ముందడుగేసింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత భూపేందర్‌ సింగ్‌ హుడా ఆదివారం బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదనపై ఇరువురు చర్చించారు. దీనికి మాయావతి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, కాంగ్రెస్‌ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అదే పొత్తును హర్యానాలో కూడా కొనసాగించాలని ఇరుపార్టీల నేతలు భావిస్తున్నారు. అయితే దీనిపై బహిరంగ ప్రకటన వెలువడాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఎన్నికల ప్రకటన వెలువడనుంది. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం పది ఎంపీ స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు