కాంగ్రెస్, టీ–మాస్‌ నేతల బాహాబాహీ

12 Apr, 2018 10:14 IST|Sakshi
ఘర్షణ పడుతున్న కాంగ్రెస్, టీ–మాస్‌ నాయకులు

అంబర్‌పేట: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో కాంగ్రెస్, టీ–మాస్‌ ఫోరం నేతల మధ్య జరిగిన వాగ్వాదం దాడులకు దారితీసింది.  దీంతో కార్యక్రమంలో అంబర్‌పేట్‌ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. బుధవారం అంబర్‌పేట అలీకేఫ్‌ చౌరస్తాలోని పూలే విగ్రహం వద్ద జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పూలే విగ్రహం వద్ద కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వి.హనుమంతరావు  ఏటా పూలే జయంతి  సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.  బుధవారం కాంగ్రెస్‌ నాయకులకంటే ముందే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించి వెళ్లారు. అనంతరం పలువురు టీ–మాస్‌ ఫోరం నేతలు అక్కడే ఉన్న మైక్‌ తీసుకుని పూలే సేవలపై ప్రసంగాలు చేస్తున్నారు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన వీహెచ్‌ తన దైనశైలిలో ‘ఇదేమీ ప్రసంగాలు రా..బై ఇక్కడ మీ సభ ఎందిరా బై’..అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. దీని  టీ–మాస్‌ నేతలు శ్రీరాములు నాయక్, అశయ్య, బాకృష్ణ ప్రతిస్పందించడంతో  ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి పరస్పర దాడులకు దారితీసింది. ఇరు వర్గాల  మధ్య తోపులాట జరిగింది. ఒక దశలో వీహెచ్‌ కిందపడడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆయనను పక్కకు తీసుకువెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. అనంతరం టీ–మాస్‌ ఫోరం నేతలు వీహెచ్‌పై అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కాంగ్రెస్‌ నేతలు సైతం టీ–మాస్‌ నేతలపై సౌండ్‌ నిర్వహకునితో ఫిర్యాదు చేయించారు. 

మరిన్ని వార్తలు