టీఆర్‌ఎస్‌ దూకుడుతో కాంగ్రెస్‌ అలర్ట్‌

10 Sep, 2018 01:12 IST|Sakshi

పొత్తులు, వలసలపై నేతల దృష్టి

మహాకూటమి ఏర్పాటు దిశగా ముమ్మర కసరత్తు

టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో కలసి ఎన్నికల బరిలోకి దిగేలా పావులు

నేడో, రేపో తెలుగుదేశంతో పొత్తు చర్చలు కొలిక్కి

త్వరలోనే తెలంగాణ జన సమితితో అవగాహన

గులాబీ అసంతృప్తులు, మాజీ నేతలకూ గాలం

ఈ వారంలోనే కాంగ్రెస్‌లోకి డీఎస్, కొండా దంపతులు!  

అనూహ్యంగా ముందస్తు ఎన్నికల ప్రతిపాదన... ప్రతిపక్షాలు తేరుకునే లోపే అసెంబ్లీ రద్దు.. ఎవరూ ఊహించనట్లుగా 105 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటన.. ఆ వెంటనే ఎన్నికల ప్రచారంలోకి... ఇలా టీఆర్‌ఎస్‌ అధినేత ప్రదర్శించిన దూకుడుతో అవాక్కయిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ఇతర రాజకీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడంతోపాటు వలసలపై దృష్టి సారించింది. టీడీపీ సహా మరికొన్ని రాజకీయ పార్టీలతో పొత్తుల విషయంలో ఓవైపు చర్చలు జరుపుతూనే పార్టీలోకి వలస నేతలను చేర్చుకునేందుకు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులు, కాంగ్రెస్‌ మాజీలకు గాలం వేస్తోంది. మొత్తంమీద కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ ‘వేదిక’ ఏర్పాటు దిశగా ముమ్మర కసరత్తు చేస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే రాష్ట్రంలోని ఇతర పార్టీలను కలుపుకొని పోవాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు గతంలోనే నిర్ణయించుకున్నా టీడీపీతో కలిసే విషయమై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా చొరవ తీసుకోవడం, కాంగ్రెస్‌ హైకమాండ్‌ కూడా ఇందుకు అంగీకరించడంతో తెలుగుదేశంతో పొత్తు చర్చలు నేడో, రేపో కొలిక్కి రానున్నాయి. టీడీపీతోపాటు సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితిలను కూడా కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేసే దిశగా కాంగ్రెస్‌ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ సూచన మేరకు ఆదివారం టీడీపీ, సీపీఐ నేతలు కలసి ఓ అవగాహనకు వచ్చారు.

సీపీఎంను కూడా కూటమిలో చేర్చుకోవాలని భావించి సీపీఐని ఇందుకు పురమాయించినప్పటికీ తమ నేతృత్వంలోనే నడుస్తున్న బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌), జనసేనలతో కలసి వెళ్లేందుకే సీపీఎం మొగ్గుచూపుతోంది. దీంతో సీపీఎం ఈ కూటమిలోకి రాకపోవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితితోనూ త్వరలోనే అవగాహన కుదుర్చుకునేలా కాంగ్రెస్‌ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ పార్టీలతో కలసి వెళ్లాల్సి వస్తే తాము పోటీ చేయాల్సిన స్థానాలు కొన్ని తగ్గే పరిస్థితి ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలన్న తక్షణ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో సర్దుకుపోవాల్సిందేనని టీపీసీసీకి చెందిన ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాకూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో తలపడతామన్నారు.

వలస పక్షులకు రెడ్‌ కార్పెట్‌...
పొత్తుల వ్యూహాన్ని పకడ్బందీగా అమలుపర్చడంతోపాటు వలస పక్షులను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్‌ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే చాలా మంది నేతలు కాంగ్రెస్‌లో చేరగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ వలసలు మరింత పెరిగాయి. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు డీఎస్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆకుల రాజేందర్, నందీశ్వర్‌గౌడ్, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌లను ఈ వారంలోనే పార్టీలో చేర్చుకోనుంది. కాంగ్రెస్‌లో చేరేందుకు వారంతా ఢిల్లీలోనూ, హైదరాబాద్‌లోనూ తమ నేతలతో చర్చలు జరుపుతున్నారు. తమకు టికెట్లు దక్కకపోవడంతో టీఆర్‌ఎస్‌తో విభేదించి కేసీఆర్, కేటీఆర్‌లకు వ్యతిరేకంగా మాట్లాడిన కొండా దంపతులు ఏ పార్టీలో చేరాలన్న దానిపై ఇంకా నిర్ణయించుకోనప్పటికీ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. వారికితోడు టీఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్తులపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కన్నేశారు. పలువురు నేతలతో ఆయన రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మొత్తంమీద అటు పొత్తులు, ఇటు వలసల వ్యూహంతో టీఆర్‌ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలనేది కాంగ్రెస్‌ లక్ష్యంగా కనిపిస్తోంది.

గుంభనంగా ‘గులాబీ’దళం...
కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగుతుంటే టీఆర్‌ఎస్‌ శిబిరం మాత్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. రాజ్యసభ సభ్యుడు డీఎస్‌ పార్టీ నుంచి వెళ్లిపోవడం ఖాయమని తేలడంతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ స్పీకర్‌ కె.ఆర్‌. సురేశ్‌రెడ్డి వికెట్‌ పడేసి స్కోరు సమం చేసింది. సురేశ్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలే తమతో టచ్‌లో ఉన్నారని, సమయానుకూలంగా వారందరినీ పార్టీలో చేర్చుకుంటామని గులాబీ నేతలు చెబుతున్నారు. ఎలాగూ అభ్యర్థులను ప్రకటించినందున టికెట్‌ ఆశించే వారిని కాకుండా క్షేత్రస్థాయిలో ప్రభావితం చేయగలిగిన నేతలపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. కాంగ్రెస్‌ వ్యూహాలు, కదలికలను అంచనా వేస్తూ ప్రచార వ్యూహాలకు పదును పెడుతూ ప్రణాళికలు రచిస్తోంది.

మరిన్ని వార్తలు