ముందు బఘేల్, తర్వాత దేవ్‌?

16 Dec, 2018 02:48 IST|Sakshi
ఢిల్లీలో రాహుల్‌తో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి పదవి ఆశావహులు చరణ్‌ దాస్‌ మహంత్, తామ్రధ్వజ్‌ సాహూ, భూపేశ్‌ బఘేల్, టీఎస్‌ సింగ్‌ దేవ్‌

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా చెరో రెండున్నరేళ్లు చాన్స్‌

అధిష్టానం రాజీ ఫార్ములా నేడు సీఎల్పీలో తుది నిర్ణయం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ సీఎం పదవిపై నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. నలుగురు కీలక నేతలతో దోబూచులాడిన సీఎం పదవి చివరికి భూపేశ్‌ బఘేల్‌ను వరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత టీపీ సింగ్‌ దేవ్‌కు సీఎంగా అవకాశమిచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరించిందని తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్‌..ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు సుదీర్ఘ చర్చలు సాగించింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తోపాటు రాష్ట్ర పరిశీలకుడు ఖర్గే, ఛత్తీస్‌గఢ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి పీఎల్‌ పునియా ఈ చర్చల్లో పాల్గొన్నారు.

తామ్రధ్వజ్‌ సాహును ఎంపిక చేస్తూ శనివారం మధ్యాహ్నం నిర్ణయం తీసుకున్నారు. తామ్రధ్వజ్‌ కేబినెట్‌లో తాము మంత్రులుగా కొనసాగబోమంటూ సీఎం రేసులో ఉన్న భూపేశ్‌ బఘేల్, టీపీ సింగ్‌ దేవ్, చరణ్‌దాస్‌ మహంత్‌ తిరుగుబాటు చేశారు. దీంతో సోనియా గాంధీ, ప్రియాంకా వాధ్రా గాంధీ రంగంలోకి దిగి రాజీ ఫార్ములాను తెరపైకి తెచ్చారని సమాచారం. దీని ప్రకారం.. బఘేల్‌ రెండున్నరేళ్లు, ఆ తర్వాత టీపీ సింగ్‌ దేవ్‌కు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించేందుకు అధిష్టానం అంగీకరించింది. అయితే, నేడు రాయ్‌పూర్‌లో జరిగే సీఎల్‌పీ సమావేశం అనంతరం అంతిమ నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు.

పలుకుబడి, మైనింగ్‌ లాబీ..
కుర్మి వర్గానికి చెందిన బఘేల్‌కు కొంత మేర ప్రజల్లో సానుకూలత ఉంది. గట్టి పలుకుబడి, ధనిక మైనింగ్‌ లాబీ మద్దతు బఘేల్‌కు పుష్కలంగా ఉంది. ఆయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు రాజధానిలో భారీగా లాబీయింగ్‌ జరిగిందని సమాచారం. కాంగ్రెస్‌ రాజీ సూత్రం సాహు వర్గ నేతలకు గట్టి దెబ్బ అని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ వర్గం వారంతా బీజేపీని వదిలి ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ వెంట ఉన్నారు. ఈ ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎలా ఉంటుందనే దానిపైనే ప్రస్తుతం అందరి దృష్టీ ఉంది. అయితే, రాజాలు లేదా రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన సింగ్‌ దేవ్‌ లాంటి వారికి బదులు గిరిజన నేతలకు ప్రోత్సాహమిచ్చి వృద్ధిలోకి తేలేకపోయిందనే భావం ప్రజల్లో కాంగ్రెస్‌పై ఉంది.

>
మరిన్ని వార్తలు