చేతి నుంచి మాయం!

11 Nov, 2018 01:37 IST|Sakshi

కాంగ్రెస్, బీఎస్పీ మధ్య వికటించిన దోస్తీ 

మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్‌పై మాయ విమర్శలు

బీఎస్‌పీతో పొత్తుకు కాంగ్రెస్‌ విముఖత

అగ్రవర్ణాల ఓట్లే కారణమంటున్న విశ్లేషకులు 

2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశమంతా అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్కటే కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమికి సిద్ధమవుతున్నాయి. అయితే, కాంగ్రెస్‌తో.. యూపీలో బలమైన అస్తిత్వం ఉన్న బీఎస్పీ కలుస్తుందా లేదా? అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఎస్పీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తాయంటూ వార్తలొచ్చాయి. దీనిపై చర్చ జరుగుతుండగానే కాంగ్రెస్‌కు బై చెప్పిన మాయావతి సొంత ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లో జోగితో కలిసి, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే.. ఈ మూడు రాష్ట్రాల్లో అగ్రవర్ణాలు, ఓబీసీలు దూరం కావొద్దనే బీఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్‌ విముఖత వ్యక్తం చేసిందని విశ్లేషకులంటున్నారు.  

తక్కువేం కాదు.. 
బీఎస్పీతో పొత్తును కాంగ్రెస్‌ లైట్‌ తీసుకోవడం మంచి నిర్ణయం కాదని కొందరు పరిశీలకుల అభిప్రాయం. బీఎస్పీకి ఈ మూడు రాష్ట్రాల్లో మంచి పట్టుందని, కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేయగల సత్తా ఉందని వీరి అంచనా. బీజేపీ, కాంగ్రెస్‌ తర్వాత పలు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ ఓట్లు సాధిస్తూ జాతీయ పార్టీగా మనగలుగుతోంది బీఎస్పీ ఒక్కటే. లోక్‌సభ ఎన్నికల్లో యూపీతోపాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ బీఎస్పీ మంచి ఓట్లే రాబట్టింది. దేశంలో ఇతర దళిత నేతల కన్నా.. మాయావతికే దళితుల్లో గుర్తింపు ఉంది. ప్రతిసారి పొత్తులో భాగంగా బీఎస్‌పీ తన వాటా ఓట్లను విజయవంతంగా బదలాయిస్తోంది.

మాయావతికీ నష్టమే 
బీఎస్పీ అధికారం కోల్పోయి ఆరేళ్లయిపోయింది. 2022 వరకు యూపీలో ఎన్నికలు లేవు. అందుకే ఇతర రాష్ట్రాల్లో స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకొని క్రమంగా విస్తరించాలని మాయావతి ప్రణాళికలు వేస్తున్నారు. కర్ణాటకలోనూ ఇదే వ్యూహంతో ఒక సీటు గెలిచారు. ఇదే విధంగా మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్‌తో పొత్తు కుదిరుంటే.. ప్రభుత్వంలో చేరే అవకాశం ఉండేది. కానీ ఈ ఆశలన్నీ అటకెక్కాయి. ఈ కోపంతోనే ఆమె ఇటీవల కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పొత్తు విఫలమైన వేళ ఈ రాష్ట్రాల్లోని దళితులు బీఎస్పీకి ఓటు వేసేందుకు ముందుకు రాకపోవచ్చు. గెలిచే అవకాశం ఉన్న పార్టీనే వారు ఎంచుకోవచ్చు. ఇది బీఎస్పీకి ఎదురుదెబ్బేనని పరిశీలకులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటుకు ప్రస్తుత పరిణామాలు ఆటంకంగా నిలవవచ్చని భావిస్తున్నారు.  

అగ్రవర్ణాల ఓట్లు 
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల హక్కుల రక్షణకు ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆర్డినెన్స్‌లోని అంశాలను వ్యతిరేకిస్తూ ఎన్నికలు జరగనున్న మూడు రాష్ట్రాల్లో అగ్రవర్ణాలు, ఓబీసీలు ఆందోళనలు నిర్వహించారు. ఈ రాష్ట్రాల్లో కలిసి అగ్రవర్ణ, ఓబీసీ ఓటర్లు 20 శాతానికిపైగానే ఉంటారు. అలాంటప్పుడు బీఎస్పీతో పొత్తుపెట్టుకుని ఈ వర్గాలను దూరం చేసుకోవడం రిస్క్‌ అని కాంగ్రెస్‌ భావించింది. ఈ రాష్ట్రాల్లో ఓబీసీలు, ఓసీలను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్‌ నానా పాట్లు పడుతోంది. గోసంరక్షణ, రాహుల్‌ శివభక్తి తదితర అంశాలను ప్రదర్శిస్తోంది. ఇలాంటప్పుడు దళిత పార్టీగా ముద్రపడ్డ బీఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్‌ వ్యూహకర్తలు అంగీకరించపోయి ఉండొచ్చని నిపుణుల అంచనా. 

తగ్గుతున్న బీఎస్పీ హవా 
2013 ఎన్నికల్లో ప్రదర్శన ఆధారంగా పొత్తులో సీట్లను కేటాయించాలని బీఎస్పీ డిమాండ్‌ చేసింది. అయితే అప్పటితో పోలిస్తే నేటి పరిస్థితుల్లో బీఎస్పీ హవా బాగా తగ్గిందని కాంగ్రెస్‌ అంచనా. ప్రధానంగా జాటవేతర కులాల్లోని దళితులకు బీఎస్పీపై భ్రమలు తొలగిపోయాయని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. ఇలాంటప్పుడు గతంలో ఉన్న బలాన్ని చూసి మాయావతికి ప్రస్తుతం సీట్లు కేటాయించడం అనవసరమనేది కాంగ్రెస్‌ ఆలోచన. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో గత ఎన్నికల్లో బీఎస్పీ వరుసగా 6.4%, 4.4%, 3.4% ఓట్లు సాధించింది. ఇంత తక్కువ ఓటు శాతాన్ని నమోదు చేస్తున్న బీఎస్పీ డిమాండ్లకు తలవంచితే.. మహాకూటమిలోని మిగిలిన పార్టీలనుంచీ ఒత్తిడి ఎదురవుతుందనేది కాంగ్రెస్‌ ఆలోచనగా కనబడుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో అనుసరిస్తున్న వ్యూహాలు ఏమాత్రం బెడిసికొట్టినా తీవ్ర నష్టమేనని భావిస్తోంది.

మరిన్ని వార్తలు