అయిదు రాష్ట్రాల్లో తుది ఫలితాలు ఇలా..

12 Dec, 2018 09:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్కంఠ రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పరిగణించిన ఈ ఫలితాలు కాంగ్రెస్‌లో నూతనోత్సహం నింపగా, బీజేపీని నిరాశపరిచాయి. రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో పాలక బీజేపీని కాంగ్రెస్‌ మట్టికరిపించింది. ఇక తెలంగాణలో టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ విస్పష్ట మెజారిటీ సాధించింది. మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ చెప్పుకోదగిన ఫలితాలు సాధించింది. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కీలకంగా మారారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీలు సాధించిన స్ధానాల వివరాలు..

తెలంగాణ..
తెలంగాణలో 119 స్ధానాల్లో టీఆర్‌ఎస్‌ 88 స్ధానాల్లో గెలుపొంది తిరుగులేని మెజారిటీ సాధించింది. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితిలతో కూడిన మహాకూటమిని మట్టికరిపించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. కారు జోరుకు కుదేలైన కాంగ్రెస్‌ కూటమి 21 స్ధానాలకు పరిమితమైంది. ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది. బీజేపీ ఒక స్ధానంలో, ఇతరులు 2 స్ధానాల్లో విజయం సాధించారు.

టీఆర్‌ఎస్‌కు 97,00,749 ఓట్లు (46.9 శాతం), కాంగ్రెస్‌కు 58,83,111 ఓట్లు (28.4 శాతం), బీజేపీ 14,50,456 ఓట్లు (7.0 శాతం), టీడీపీ 7,25,845(3.5 శాతం), స్వతంత్రులు 6,73,694 ఓట్లు (3.3 శాతం), ఎంఐఎం 5,61,089 ఓట్లు (2.7 శాతం), బీఎస్పీ 4,28,430 ఓట్లు (2.7 శాతం), ఎస్‌ఎంఎఫ్‌బీ 1,72,304 ఓట్లు (0.8 శాతం), ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 1,72,304 ఓట్లు (0.8 శాతం), బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ 1,14,432 ఓట్లు(0.7 శాతం) వచ్చాయి.

మధ్యప్రదేశ్‌..
మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ పోరుసాగినా చివరకు కాంగ్రెస్‌ పైచేయి సాధించింది. మొత్తం 230 స్ధానాలకు గాను కాంగ్రెస్‌ 114 స్ధానాల్లో విజయం సాధించగా, బీజేపీ 109 స్ధానాల్లో గెలుపొందింది. బీఎస్పీ రెండు స్ధానాలు గెలుచుకోగా, ఇతరులు అయిదు స్ధానాల్లో గెలుపొందారు. మధ్యప్రదేశ్‌లో స్వతంత్రులు, బీఎస్పీ ఎమ్మెల్యేలు కీలకంగా మారారు.

బీజేపీకి 1,56,42,980 ఓట్లు(41శాతం), కాంగ్రెస్‌కు 1,55,95,153 ఓట్లు (40.9 శాతం), ఇండిపెండెంట్లకు 22,18,230 ఓట్లు (5.8 శాతం), బీఎస్పీకి 19,11,642 ఓట్లు (5 శాతం), సీజీపీకి 6,75,648 ఓట్లు (1.8 శాతం), ఎస్పీకి 4,96,025 ఓట్లు (1.3 శాతం), ఏఏఏపీకి 2,53,101 ఓట్లు (0.4 శాతం), ఎస్‌పీఏకేపీకి 1,56,486 ఓట్లు (0.4 శాతం), బీఏఎస్‌డీకి 78,692 ఓట్లు (0.2 శాతం), బీఎస్‌సీపీకి 71,278 ఓట్లు (0.2 శాతం) ఓట్లు లభించాయి.

రాజస్ధాన్‌
ఎడారి రాష్ట్రం రాజస్ధాన్‌లో మొత్తం 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్‌ జరిగింది. కాంగ్రెస్‌ 99 స్ధానాలను హస్తగతం చేసుకోగా, బీజేపీ 73 స్ధానాల్లో గెలుపొందింది. బీఎస్పీ ఆరు స్ధానాల్లో, ఇతరులు అత్యధికంగా 21 స్ధానాల్లో విజయం సాధించారు.

కాంగ్రెస్‌కు 1,39,35,201 ఓట్లు (39.3 శాతం), బీజేపీకి 1,37,57,502 ఓట్లు (38.3 శాతం), ఇండిపెండెంట్లకు 33,72,206 ఓట్లు (9.5 శాతం), బీఎస్పీకి 14,10,995 ఓట్లు (4 శాతం), ఆర్‌ఎల్‌టీపీకి 8,56,038 ఓట్లు (2.4 శాతం), సీపీఎంకు 4,34,210 ఓట్లు (1.2 శాతం), బీజేపీకి 2,55,100 ఓట్లు (0.7 శాతం), ఏఏఏపీకి 1,35,826 ఓట్లు (0.4 శాతం), ఆర్‌సీడీకి 1,16,320 ఓట్లు (0.3 శాతం), బీవీహెచ్‌పీ 1,11,357 (0.3 శాతం) ఓట్లు లభించాయి.

చత్తీస్‌గఢ్‌..
చత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్ధానాల్లో కాంగ్రెస్‌ మూడింట రెండొంతులు పైగా 68 స్ధానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ ప్రభంజనంతో బీజేపీ బేజారైంది. పదిహేనేళ్ల పాటు చత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో కేవలం 15 స్ధానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక అజిత్‌ జోగి నేతృత్వంలోని జేసీసీ 7 స్థానాల్లో విజయం సాధించింది.

కాంగ్రెస్‌కు 61,44,192 ఓట్లు (43 శాతం), బీజేపీకి 47,07,141 ఓట్లు (33 శాతం), జేసీసీజేకు 10,86,531 ఓట్లు (7.6 శాతం), ఇండిపెండెంట్లకు 8,39,053 ఓట్లు (5.9 శాతం), బీఎస్పీకి 5,52,313 ఓట్లు (3.9 శాతం), జీజీపీకి 2,47,459 ఓట్లు (1.7 శాతం), ఏఏఏపీకి 1,23,526 ఓట్లు (0.9 శాతం), సీపీఐకి 48,255 ఓట్లు (0.3 శాతం), ఎస్‌హెచ్‌ఎస్‌కు 34,678 ఓట్లు(0.2 శాతం) దక్కాయి

మిజోరం..
ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్‌ అధికారాన్ని కోల్పోయింది. మొత్తం 40 స్ధానాలకు గాను మిజో నేషనల్‌ ఫ్రంట్‌ 26 స్ధానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌ 5 స్ధానాలు, బీజేపీ ఒక స్ధానం దక్కించుకోగా, ఇతరులు 8 స్ధానాల్లో గెలుపొందారు.

మిజో నేషనల్‌ ఫ్రంట్‌కు 2,37,305 ఓట్లు (37.6 శాతం), కాంగ్రెస్‌కు 1,90,412 ఓట్లు (30.2 శాతం),ఇండిపెండెంట్లకు 1,44,925 ఓట్లు (22.9 శాతం), బీజేపీకి 50,749 ఓట్లు (8 శాతం), ఎన్‌పీఈపీకి 3626 ఓట్లు (0.6 శాతం), పీఆర్‌ఐఎస్‌ఎంపీకి 1262 ఓట్లు (0.2 శాతం), నోటాకు 2917 ఓట్లు (0.5 శాతం) లభించాయి.

మరిన్ని వార్తలు