అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే అస్త్రంగా..

1 Jun, 2018 16:08 IST|Sakshi
యూపీఏ చీఫ్‌ సోనియా గాంధీతో బీఎస్‌పీ అధినేత్రి మాయావతి (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమితో త్వరలో జరగనున్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌, బీఎస్‌పీలు చేతులు కలిపేందుకు సంసిద్ధమయ్యాయి. కాంగ్రెస్‌, బీఎస్‌పీ కూటమితో ఆయా రాష్ట్రాల్లో దళిత ఓట్లను ఆకర్షించవచ్చని ఇరు పార్టీలూ అంచనా వేస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీకి 30 స్ధానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ముందుకొచ్చింది. సీట్ల పంపకంపై ఇంకా ఇరు పార్టీలూ ఒక అవగాహనకు రాలేదు. యూపీ వెలుపల భారీగా విస్తరించి జాతీయ స్ధాయిలో ఉనికి చాటుకునేందుకు బీఎస్‌పీ కసరత్తు చేస్తోంది. కర్ణాటకలో ఎన్నికలకు ముందు జేడీఎస్‌తో బీఎస్‌పీ పొత్తు కుదుర్చుకుని ఒక స్ధానంలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇక బీఎస్‌పీ చీఫ్‌ మాయావతి, యూపీఏ చీఫ్‌ సోనియా గాంధీల మధ్య సన్నిహిత సంబంధాలు కూడా ఇరు పార్టీలను పొత్తు దిశగా నడిపిస్తున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరైన సందర్భంగా సోనియా, మాయావతిలు అత్యంత సన్నిహితంగా మెలగడాన్ని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. గత కొద్దివారాలుగా ఢిల్లీలో మకాం వేసిన మాయావతి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కసరత్తులపై సమాలోచనలు జరిపారు. 

మరిన్ని వార్తలు