గహ్లోత్‌ గట్టెక్కినట్టే!

14 Jul, 2020 03:04 IST|Sakshi
జైపూర్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమావేశంలో విజయ సంకేతం చూపుతున్న రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్, పార్టీ సీనియర్‌ నేతలు రణదీప్‌ సూర్జేవాలా, అవినాశ్‌ పాండే తదితరులు

సీఎల్పీ భేటీకి 106 మంది ఎమ్మెల్యేలు!

రాజస్తాన్‌లో గహ్లోత్‌ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం

సమావేశానంతరం రిసార్టుకు తరలింపు

పైలట్‌కు నచ్చజెప్పిన సోనియా, రాహుల్, ప్రియాంక

అగ్రనేతల బుజ్జగింపుతో మెత్తబడ్డ తిరుగుబాటు నేత!

జైపూర్‌/న్యూఢిల్లీ: రాజస్తాన్‌ రాజకీయ సంక్షోభాన్ని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తట్టుకుని నిలిచినట్లే కనిపిస్తోంది. సోమవారం వేగంగా జరిగిన పరిణామాల్లో... గహ్లోత్‌ వెనక చాలినంత మంది ఎమ్మెల్యేలుండటం... సచిన్‌ పైలట్‌కు బాసటనిచ్చిన వారి సంఖ్య పలచనైపోవటం వంటివి కనిపించాయి. దీంతో అశోక్‌ గహ్లోత్‌ కాసింత కులాసాగా కనిపించారు. సీఎల్పీ సమావేశానంతరం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలిస్తూ విజయ చిహ్నాన్ని కూడా చూపించారు.

మరోవంక.. తిరుగుబాటు బావుటా ఎగరేసిన పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ కూడా మెత్తబడ్డారని సమాచారం. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీతో పాటు పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పైలట్‌తో చర్చించారని... గహ్లోత్‌పై ఫిర్యాదులేమైనా ఉంటే.. సానుకూలంగా పరిష్కరిస్తామని ఆయనకు హామీ ఇచ్చారని సమాచారం. సీనియర్‌ నేతలు చిదంబరం, అహ్మద్‌ పటేల్, కేసీ వేణు గోపాల్‌ కూడా పైలట్‌తో మాట్లాడటంతో ఆయన కాస్త మెత్తబడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సీఎల్పీ భేటీకి 106 మంది?
రాజస్తాన్లో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు సంబంధించి స్టేట్‌మెంట్‌ కావాలంటూ రాజస్తాన్‌ పోలీస్‌ విభాగం తనకు నోటీసులివ్వటంతో పైలట్‌ ఆగ్రహం చెంది సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు చేయడం తెలిసిందే. తదనంతర పరిణామాల్లో తన వెంట 30 మంది ఎమ్మెల్యేలున్నారని కూడా ప్రకటించారాయన. ఈ నేపథ్యంలో ఉదయం జైపూర్లో కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్పీ) భేటీ అయింది.

దీనికి ఎందరు హాజరయ్యారన్నది స్పష్టంగా తెలియకపోయినా... 106 మంది వరకూ వచ్చినట్లు సీఎల్పీ ప్రకటించింది. అంటే ఒక్క సచిన్‌ పైలట్‌ మినహా అందరూ తమతోనే ఉన్నారనే సంకేతాలిచ్చే ప్రయత్నం చేసింది. అయితే దీనికి హాజరైన వారిలో కాంగ్రెస్‌ సభ్యులే కాక సర్కారుకు మద్దతిస్తున్న ఇతర పార్టీల వారూ ఉన్నట్లు సీఎల్పీ వర్గాలు చెప్పాయి. మొత్తానికి ఈ భేటీకి హాజరైన ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి గహ్లోత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాక ప్రభుత్వాన్ని, పార్టీని బలహీన పర్చేందుకు ప్రయత్నించే సీఎల్పీ సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. పైలట్‌ పేరును ప్రస్తావించకుండా.. ఓ తీర్మానాన్ని సైతం ఆమోదించారు.

‘సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ నాయకత్వంపై సీఎల్పీ సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తోంది. ముఖ్యమంత్రిగా గహ్లోత్‌ నాయకత్వాన్ని ఏకగ్రీవంగా సమర్ధిస్తోంది’అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ బీజేపీపై ఆ తీర్మానంలో ధ్వజమెత్తారు. అనంతరం, ఎమ్మెల్యేలను అక్కడి నుంచి నేరుగా జైపూర్‌ దగ్గర్లోని ఫెయిర్‌మాంట్‌ రిసార్ట్‌కు తరలించారు. వారితో పాటు సీఎం గహ్లోత్‌ కూడా అక్కడికి వెళ్లారు. తన ప్రభుత్వానికి ఢోకా లేదని, మెజారిటీ ఎమ్మెల్యేలు తన వైపే ఉన్నారని ఈ సందర్భంగా గహ్లోత్‌ చెప్పారు.  

విశ్వాసం కోల్పోయింది
రాజస్తాన్‌లో అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని, ఆ పార్టీ ఇక అధికారంలో కొనసాగకూడదని బీజేపీ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా సచిన్‌ పైలట్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తారా? అని రాజస్తాన్‌ బీజేపీ చీఫ్‌ సతీశ్‌ పూనియాను ప్రశ్నించగా.. అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని, స్థానిక పరిస్థితులను బేరీజు వేస్తూ.. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌లో సమర్ధులైన యువ నాయకులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తుంటారని వ్యాఖ్యానించారు.   

మెజారిటీని చూపాల్సింది అసెంబ్లీలో.. ఇంట్లో కాదు!
సీఎల్పీ భేటీ నిర్వహించి, మెజారిటీ సభ్యుల మద్దతుందని సీఎం గహ్లోత్‌ పేర్కొనడంపై పైలట్‌ వర్గం స్పందించింది. మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకోవాలని, ఇంట్లో కాదని వ్యాఖ్యానించింది. అలాగే, పైలట్‌ బీజేపీలో చేరబోవడం లేదని స్పష్టం చేసింది. 106 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గహ్లోత్‌ వర్గ నేతలు చెప్పడాన్ని పైలట్‌కు సన్నిహితులైన పార్టీ నేతలు తప్పుబట్టారు. మెజారిటీ ఉంటే.. ఎమ్మెల్యేలను గవర్నర్‌ వద్దకు తీసుకువెళ్లాలి కానీ, రిసార్ట్‌కు కాదని ఎద్దేవా చేశారు.

నేడు మళ్లీ సీఎల్పీ  
కాంగ్రెస్‌ శాసనసభాపక్షం నేడు మరోసారి భేటీ కానుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్‌లోనే ఆ సమావేశం జరుగుతుందని సీనియర్‌నేత  సూర్జెవాలా వెల్లడించారు. ఆ భేటీకి రావాలని, అన్ని అంశాలపై అక్కడ స్వేచ్ఛగా చర్చించుకోవచ్చని తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌కు సూచించారు. భేటీకి ఆహ్వానిస్తూ పైలట్‌కు, అసంతృప్త ఎమ్మెల్యేలకు లేఖలు పంపించామన్నారు.

పైలట్‌ వెనుక ఎందరు?
200 మంది సభ్యులున్న రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ సొంత బలం 107. స్వతంత్రులు 13 మంది, సీపీఎం–2 కలిపితే ఇప్పటిదాకా 122 మంది మద్దతుంది. 72 మంది సభ్యులున్న బీజేపీకి ఆరెల్పీ, ఆరెల్డీ నుంచి నలుగురి మద్దతుంది. ఇద్దరు బీటీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నారు. సోమవారం నాటి సమావేశానికి సచిన్‌ పైలట్‌తో పాటు ఆయనకు సన్నిహితులైన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. అయితే వీరి సంఖ్య 10 కూడా ఉండదని, కాబట్టి గహ్లోత్‌ సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని సీఎల్పీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్‌ నేతలపై ఐటీ దాడులు
జైపూర్‌లో సీఎల్పీ భేటీకి కొన్ని గంటల ముందు కాంగ్రెస్‌ నేతలు రాజీవ్‌ అరోరా, ధర్మేంద్ర రాథోడ్‌లకు సంబంధమున్న పలు వాణిజ్య సంస్థలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. జైపూర్, ఢిల్లీ, ముంబై, కోట నగరాల్లోని ఆయా సంస్థల కార్యాలయాల్లో పన్ను ఎగవేత కేసులకు సంబంధించి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జైపూర్‌లోని ఆమ్రపాలి జ్యువెలర్స్‌ షోరూమ్‌లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సంస్థ రాజస్తాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ అరోరాకు చెందినదిగా తెలుస్తోంది. ఇదంతా బీజేపీ కుట్ర అని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఐటీ, ఈడీ, సీబీఐ బీజేపీ అనుబంధ విభాగాలుగా మారాయని రణ్‌దీప్‌ సూర్జేవాలా విమర్శించారు.

మరిన్ని వార్తలు