విజయానికి ‘నడక’ నేర్పిన బాటసారి

6 Nov, 2018 02:54 IST|Sakshi

పాదయాత్రతో ప్రభంజనం

రాజశేఖరరెడ్డికి తెలుగు ప్రజల  బ్రహ్మరథం

185 స్థానాలతో అధికారంలోకి కాంగ్రెస్‌

2004 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు మండు వేసవిలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సాగించిన 1,470 కిలోమీటర్ల పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. పదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ను ఈ యాత్ర గద్దెనెక్కించింది. ప్రజాప్రస్థానం పేరుతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభమైన వైఎస్‌ పాదయాత్ర 11 జిల్లాల మీదుగా కొనసాగి ఇచ్చాపురంలో ముగిసింది. వరుసగా రెండేళ్లు కరవు కాటకాలతో నష్టపోయిన రైతులు, వివిధ వర్గాల ప్రజల ఇబ్బందులను రాజశేఖరరెడ్డి ఈ యాత్రలో స్వయంగా తెలుసుకున్నారు. ఈ అవగాహనతోనే ఆయన 2004 అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికను రూపొందించారు. 

సాక్షి, నాలెడ్జ్‌ సెంటర్‌: రెండు వరుస ఓటముల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ 12వ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 మే14న ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. లోక్‌సభతోపాటే జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్‌.చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ఘోర పరాజయంపాలైంది. ఎనిమిదిన్నరేళ్ల చంద్రబాబు పాలనకు తెరపడింది. రాష్ట్రంలోని 294 సీట్లలో కాంగ్రెస్‌ 185 సీట్లు కైవసం చేసుకుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత.. అతి తక్కువ అంటే 47 స్థానాలకే పరిమితమైంది. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌), సీపీఐ, సీపీఎంతో సీట్లు సర్దుబాటు చేసుకుని కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ 26, సీపీఎం 9, సీపీఐ 6 సీట్లు గెలుచుకున్నాయి. మొత్తం 42 లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్‌ 29, టీఆర్‌ఎస్‌ 5, టీడీపీ 5, సీపీఐ, సీపీఎం చెరో స్థానం కైవసం చేసుకున్నాయి. వైఎస్‌ 1999 తర్వాత మళ్లీ 2004లో పులివెందుల నుంచే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ నిజామాబాద్‌ నుంచి గెలిచారు. టీడీపీతో పొత్తుపెట్టుకుని పోటీచేసిన బీజేపీ రెండు సీట్లే గెలుచుకుంది.

ఎంఐఎం మరోసారి నాలుగు సీట్లు సాధించింది. మొత్తంమీద కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం కూటమికి 226 సీట్లు దక్కాయి. చంద్రబాబు కేబినెట్‌లోని తెలంగాణ మంత్రులు పి.చంద్రశేఖర్‌ (మహబూబ్‌నగర్‌), తుమ్మల నాగేశ్వరరావు (సత్తుపల్లి), కరణం రామచంద్రరావు  (మెదక్‌), కడియం శ్రీహరి (ఘన్‌పూర్‌), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్స్‌వాడ), మండవ వెంకటేశ్వరరావు  (డిచ్‌పల్లి), తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ (సికింద్రాబాద్‌) సహా పలువురు టీడీపీ నేతలు ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన నాయిని నరసింహారెడ్డి (ముషీరాబాద్‌), ఎస్‌.సంతోష్‌రెడ్డి (ఆర్మూర్‌), ఎ.చంద్రశేఖర్‌ (వికారాబాద్‌), వి.లక్ష్మీకాంతరావు (హుజూరాబాద్‌), జి.విజయరామారావు (ఘన్‌పూర్‌) వైఎస్‌ మంత్రివర్గంలో చేరారు. తర్వాత సిద్దిపేట నుంచి ఉప ఎన్నికలో గెలిచిన టి.హరీశ్‌రావు కూడా ఈ ఐదుగురితోపాటు మంత్రి అయ్యారు. సిద్దిపేట నుంచి అసెంబ్లీకి, కరీంనగర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికవడంతో కేసీఆర్‌ అసెంబ్లీకి రాజీనామా చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తానని చేసిన వాగ్దానం, అనావృష్టితో కుదేలైన రైతాంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడం, పెరిగిన విద్యుత్‌ చార్జీలు వంటివి కాంగ్రెస్‌ విజయానికి దోహదం చేశాయి. ఎనిమిదేళ్ల ఎనిమిది నెలల చంద్రబాబు పాలనపై జనంలో పెల్లుబికిన వ్యతిరేకత టీడీపీ ఓటమికి ప్రధాన కారణమైంది. ఎన్నికల హామీ ప్రకారం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఫైలుపై రాజశేఖరరెడ్డి తొలి సంతకం చేశారు. టీడీపీ టికెట్‌పై ఆసిఫ్‌నగర్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌ కొన్ని నెలలకే రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో నాగేందర్‌ (కాంగ్రెస్‌)ను ఎంఐఎం అభ్యర్థి ఓడించారు. 

ఉప ఎన్నికలు...
2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 9 ఎమ్మెల్యే సీట్లు (మొత్తం 16లో), రెండు ఎంపీ స్థానాలు (నాలుగు సీట్లలో) కోల్పోయింది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ ఐదు, టీడీపీ నాలుగు స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్, టీడీపీ చెరో ఎంపీ సీటు గెలుచుకున్నాయి. 2004 లోక్‌సభ ఎన్నికల్లో.. 37–5 సీట్ల తేడాతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వామపక్షాలు టీడీపీ–బీజేపీ జట్టుపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 27 సీట్లలో 4 మినహా అన్ని స్థానాలను కాంగ్రెస్‌ మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 15 సీట్లలో టీడీపీ, బీజేపీలకు కేవలం ఒకే సీటు వచ్చింది. మిగతా స్థానాలన్నింటినీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఐ, ఎంఐఎం గెలిచాయి.

తెలంగాణ  నుంచి...
ఈ ప్రాంతంలో టీడీపీ–బీజేపీ కూటమికి చెందిన మందా జగన్నాథం (టీడీపీ–నాగర్‌కర్నూల్‌) ఒక్కరే గెలిచారు. అసదుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం–హైదరాబాద్‌) తొలిసారి గెలిచి పార్లమెంట్‌లోకి ప్రవేశించారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ (కరీంనగర్‌), ఆలె నరేంద్ర (మెదక్‌), బి.వినోద్‌కుమార్‌ (హనుమకొండ), డి. రవీంద్రనాయక్‌ (వరంగల్‌), టి.మధుసూదనరెడ్డి(ఆదిలాబాద్‌) గెలిచారు. సీపీఐ నేత సురవరం సుధాకరరెడ్డి రెండోసారి నల్లగొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు కాంగ్రెస్‌ నుంచి సీనియర్లు జి.వెంకటస్వామి (పెద్దపల్లి–ఎస్సీ), సూదిని జైపాల్‌రెడ్డి (మిర్యాలగూడ) గెలుపొందగా, తొలిసారి ఎంపీలుగా మధు యాష్కీగౌడ్‌ (నిజామాబాద్‌), అంజన్‌కుమార్‌యాదవ్‌ (సికింద్రాబాద్‌), సర్వే సత్యనారాయణ (సిద్ధిపేట–ఎస్సీ) ఎన్నికయ్యారు.మొత్తం 21 మంది మహిళా అభ్యర్థులు పోటీచేయగా, 12 మందికి డిపాజిట్లు దక్కలేదు. దగ్గుబాటి పురందేశ్వరి (కాంగ్రెస్‌–బాపట్ల), పనబాక లక్ష్మి (కాంగ్రెస్‌–నెల్లూరు), రేణుకా చౌదరి (కాంగ్రెస్‌–ఖమ్మం) గెలిచారు.

మరిన్ని వార్తలు