59 నియోజకవర్గాలు 18 రోజులు..

8 Oct, 2018 01:21 IST|Sakshi

కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార తొలిదశ షెడ్యూల్‌ ఖరారు 

ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 10 నుంచి నవంబర్‌ 2 వరకు... 

బహిరంగ సభలు, రోడ్‌షోలు

హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్‌ జిల్లాల్లో రెండోదశ 

ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయాలి: భట్టి 

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారయింది. తొలిదశలో భాగంగా ఈ నెల 10 నుంచి వచ్చే నెల 2 వరకు ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే షెడ్యూల్‌ను టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఆదివారం విడుదల చేసింది. ఈ నెల 4న అలంపూర్‌ నియోజకవర్గంలోని జోగులాంబ దేవాలయం నుంచి ప్రచార శంఖారావాన్ని పూరించిన కాంగ్రెస్‌ నేతలు అక్కడి నుంచే తమ ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఈనెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లనున్న ముఖ్య నేతలు 11 గంటలకు దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట వద్ద ప్రచారాన్ని ప్రారం భిస్తారు. అక్కడి నుంచి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల మీదుగా వారం రోజుల పాటు ప్రచారం నిర్వహిస్తారు. మళ్లీ 20, 21 తేదీల్లో ఖమ్మం జిల్లాలోనే ప్రచారం కొనసాగిస్తారు. ఆ తర్వాత 2 రోజుల (22, 23 తేదీల్లో) పాటు విరామం తీసుకుని మళ్లీ 24న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రచారం ప్రారంభిస్తారు. ఆ జిల్లాలో 26 వరకు ప్రచారాన్ని ముగించుకుని 27న విరామం తీసుకుంటారు. మళ్లీ 28న కరీంనగర్‌ జిల్లా నుంచి ప్రారంభించి నవంబర్‌ 2న భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రచారం ముగిస్తారు. మొత్తం 18 రోజుల పాటు ఆరు ఉమ్మడి జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో తొలి దశ ప్రచారం సాగనుంది. ప్రచార షెడ్యూల్‌కు అనుగుణంగా టీపీసీసీ ముఖ్య నేతలు కూడా జిల్లాల్లోనే బస చేయనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్‌ జిల్లాల ప్రచార షెడ్యూల్‌ను ఇంకా ఖరారు చేయలేదు. తొలి దశ పూర్తయిన తర్వాత వెంటనే రెండోదశ ప్రచారాన్ని ప్రారంభించి, నామినేషన్ల ప్రక్రియ ఊపందుకునే లోపే ఈ జిల్లాల్లో కూడా ముగించాలనే ఆలోచనలో టీపీసీసీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.  

కార్యోన్ముఖులు కావాలి: ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క 
ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ కేడర్‌ కార్యోన్ముఖులు కావాలని టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజానీకాన్ని విముక్తి చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనకు స్ఫూర్తినిచ్చేలా ప్రచారం జరిగేలా పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఇంటింటికీ ఎన్నికల ప్రచారం వెళ్లేలా క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు.  

కాంగ్రెస్‌ ప్రచారం ఇలా... 
అక్టోబర్‌ 10వ తేదీ: దేవరకద్ర, మక్తల్, నారాయణపేట 
11న: మహబూబ్‌నగర్, జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌ 
12న: కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి 
13న: దేవరకొండ, మునుగోడు, నల్లగొండ 
14న: నకిరేకల్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌ 
15న: సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ 
16న: పాలేరు, ఖమ్మం, వైరా 
20న: బోనకల్, సత్తుపల్లి, కొత్తగూడెం 
21న: భద్రాచలం, పినపాక, ఇల్లందు 
24న: ఆదిలాబాద్, బోథ్, ముథోల్, నిర్మల్‌ 
25న: ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్‌ 
26న: బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల 
28న: మంథని, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి 
29న: జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల, వేములవాడ 
30న: కరీంనగర్, మానకొండూరు, హుస్నాబాద్‌ 
31న: జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్‌ ఈస్ట్, వరంగల్‌ వెస్ట్‌ 
నవంబర్‌ 1న: పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట 
2న: పరకాల, ములుగు, భూపాలపల్లి  
 

మరిన్ని వార్తలు