గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక.. కరెంట్‌, వాటర్‌ కట్‌!

20 Jul, 2019 11:08 IST|Sakshi

ప్రియాంకను అరెస్టు చేసి.. గెస్ట్‌హౌస్‌లో ఉంచడంపైనిప్పులు చెరిగిన కాంగ్రెస్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌ సోన్‌భద్ర జిల్లాలో జరిగిన కాల్పుల్లో మరణించిన వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీని మధ్యలోనే అడ్డుకొని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బాధితులను పరామర్శించేవరకు వెనక్కి వెళ్లేది లేదని ఆమె భీష్మించుకొని కూర్చోవడంతో పోలీసులు ప్రియాంకను మీర్జాపూర్‌లోని చునార్‌ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. అయితే, ప్రియాంకను తరలించిన గెస్ట్‌హౌస్‌కు విద్యుత్‌, తాగునీటి సరఫరాను యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం నిలిపేసిందని కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. యోగి నేతృత్వంలోని యూపీలో ఆటవిక పాలన సాగుతోందని ధ్వజమెత్తింది.

‘సోన్‌భద్ర సామూహిక హత్యాకాండను అడ్డుకోవడంలోనూ, దోషులను వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలోనూ  బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న ప్రియాంకను బీజేపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసింది. ఆమె ఉంటున్న చునార్‌ గెస్ట్‌హౌస్‌కు విద్యుత్‌, తాగునీటి సరఫరాను నిలిపేశారు. ఆమెను యూపీ నుంచి పంపించాలని బీజేపీ సర్కార్‌ చూస్తోంది. ఇదీ ఆటవిక పాలన’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాల్‌ ట్వీట్‌ చేశారు. 

ఈ నెల 17న సోన్‌భద్ర జిల్లా గోరేవాల్‌ ప్రాంతంలో ఓ భూవివాదం విషయమై కాల్పులు చోటుచేసుకొని 10మంది గోండీ తెగ ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం బాధితులను పరామర్శించేందుకు సోన్‌భద్రకు బయలుదేరిన  కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీను అడ్డుకొని చునార్‌ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. రాత్రి గెస్ట్‌హౌస్‌లో బస చేసిన ఆమె.. బాధితులను కలిసే వరకు వెనక్కి వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు.
 

మరిన్ని వార్తలు