కొత్త సారథి కావలెను

2 Mar, 2020 03:09 IST|Sakshi

అధ్యక్ష ఎన్నికలు జరపాలంటున్న నేతలు 

రాహుల్‌ తీరుతో విసిగిపోతున్న శ్రేణులు 

సోనియానే పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టాలని డిమాండ్లు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ నిర్లిప్త ధోరణి, పార్ట్‌ టైమ్‌ పాలిటిక్స్‌పై పార్టీ నేతలు విసిగిపోతున్నట్టే కనిపిస్తోంది. అత్యంత కీలకమైన సవాళ్లు ఎదురైన సమయంలో కూడా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం, ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. గాంధీ కుటుంబానికి వీరవిధేయులు మాత్రం సోనియాయే పూర్తి స్థాయిలో అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నా కాంగ్రెస్‌కి పూర్వవైభవం తీసుకురావడానికి రాహుల్‌ గాంధీ చిన్నపాటి ప్రయత్నం చేయకపోవడం, మతపరమైన అంశాల్లో బీజేపీని ఇరుకున పెట్టే విధంగా వ్యూహరచన చేయలేకపోవడం పార్టీ శ్రేణుల్లో నిరాశను నింపుతోంది.

రాహుల్‌ ఏం మాట్లాడినా అవి పార్టీకే ఎదురు తిరుగుతూ ఉండడంతో రాహుల్‌ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని ఇన్నాళ్లూ డిమాండ్‌ చేసినవారే ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం అనంతరం అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా చేయడంతో మరో గత్యంతరం లేక సోనియా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. సోనియాకు వయసు మీద పడినా, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా రాహుల్‌తో పోల్చి చూస్తే ఆమె నయం అన్న అభిప్రాయానికి చాలా మంది నేతలు వస్తున్నారు. లేదంటే కాంగ్రెస్‌కి కొత్త సారథి వచ్చినా మంచిదేనన్న అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. ఈ మధ్య కాలంలో రాహుల్‌ గాంధీ నిర్లిప్తతను బహిరంగంగానే నాయకులు ఎండగడుతున్నారు. మరికొందరు అంతర్గత సంభాషణల్లో రాహుల్‌ తీరుతెన్నులపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌధురి రాహుల్, ప్రియాంకలు ఇద్దరూ పార్టీకి దూరంగా ఉంటేనే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాహుల్‌ గాంధీ లేకపోతే కాంగ్రెస్‌ మనుగడ సాధించలేదా ? అని ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది.  

ఎవరేమన్నారంటే  
రాహుల్‌ గాంధీ తిరిగి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారో లేదో తేల్చి చెప్పడం లేదు. ఆయన నాన్చుడు ధోరణి వల్ల కాంగ్రెస్‌ పార్టీకి దారి తెన్నూ తెలియడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌కి కరుకు చురుకు కలిగిన అధ్యక్షుడి అవసరం ఉంది   

 
– శశిథరూర్, ఎంపీ

కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. సోనియాగాంధీ తాత్కాలికంగా మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. వెంటనే ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడెవరో తేల్చాలి. ఒకవేళ రాహుల్‌ గాంధీ పోటీ పడకపోతే కొత్త వారికి పగ్గాలు అప్పగించాలి
– అభిషేక్‌ మను సింఘ్వి, ఎంపీ  

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీని ముందుండి నడిపించగలిగే నాయకురాలు సోనియా గాంధీ మాత్రమే. పార్టీకి మంచి భవిష్యత్‌ ఉండాలంటే సోనియాయే పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టాలి
– మనీశ్‌ తివారీ, ఎంపీ

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులెవరూ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలని భావించడం లేదు. ఎందుకంటే గాంధీ కుటుంబానికి వ్యతిరేకులెవరైనా ఆ పదవిలోకి వస్తే కష్టం     
– సందీప్‌ దీక్షిత్, ఎంపీ

మరిన్ని వార్తలు