కాంగ్రెస్‌ సీఎంల వివాదాస్పద నిర్ణయాలు

7 Jan, 2019 21:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కొలువుతీరిన కాంగ్రెస్‌ కొత్త ముఖ్యమంత్రులు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరవు తీస్తున్నాయా? రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను అవి దెబ్బతీయనున్నాయా? అసలు ఆ వివాదాస్పద నిర్ణయాలు ఏమిటీ? 

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌లో వెలువడగానే ముఖ్యమంత్రి పదవికి జ్యోతిరాదిత్య సింధియాకు బదులుగా కమల్‌నాథ్‌ను రాహుల్‌ గాంధీ ఎంపిక చేయడమే మొట్టమొదట వివాదాస్పదమైంది. 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో కమల్‌నాథ్‌ పాత్రను తప్పుపట్టిన నానావతి కమిషన్, ఆయన నుంచి వివరణ కోరింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2015లో సిక్కుల ఓట్లను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ని సస్పెండ్‌ చేసింది. అలాంటప్పుడు సీఎం పదవికి ఆయన్ని దూరంగా పెట్టి ఉంచాల్సింది. పార్టీకి అతి తక్కువ మెజారిటీ ఉన్నందున ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి కమల్‌నాథ్‌ వంటి అనుభవజ్ఞులు ఉండాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావించింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జరిగిన ఓ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ సిక్కుల ఊచకోతతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని సీఎంను చేశారంటూ ఆరోపించడం ఇక్కగ గమనార్హం. 

ఇక కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. యూపీ, బీహార్‌ నుంచి వస్తున్న వలసదారులు స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు రిజర్వ్‌ చేసే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని కూడా ఆయన చెప్పారు. ఇక రాష్ట్ర సచివాలయంలో గత 13 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ‘వందేమాతరం’ గీతాలాపనను నిలిపివేయడం. పైగా ఆ ఆనవాయితీని మరింత మెరుగ్గా అమలు చేద్దామనే ఉద్దేశంతోనే రద్దు చేశానంటూ సమర్థించకున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సహా నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసు బ్యాండ్‌తోని వందేమాతర గీతాలాపన పునరుద్ధరిస్తున్నట్లు కమల్‌నాథ్‌ ప్రకటించాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్రం నుంచి జైలుకెళ్లిన వారికి బీజేపీ ప్రభుత్వం 2008లో ప్రవేశపెట్టిన నెలకు పాతిక వేల రూపాయల పింఛన్‌ పథకాన్ని నిలిపివేయడం కమల్‌ నాథ్‌ సర్కార్‌ తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయం. 

చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి అంతే
చత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘెల్‌ కూడా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. 2014 నుంచి 2017 వరకు బస్తర్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా పనిచే సిన ఎస్‌ఆర్‌పీ కల్లూరిని రాష్ట్ర అవినీతి వ్యతిరేక బ్యూరో, ఆర్థిక నేరాల విభాగంకు అధిపతిగా నియమించడం వివాదాస్పదమైంది. ఆ మూడేళ్ల కాలంలో ఆయన అనేక బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డారని, ప్రజలపై దౌర్జన్యం చేయడంతోపాటు రేప్‌లు చేశారన్న ఆరోపణలు కూడా ఆయనపై వచ్చాయి. అప్పుడు కల్లూరిని జైల్లో పెట్టాలని చత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి హోదాలో డిమాండ్‌ చేసిన భూపేష్‌ ఆయన సీఎం హోదాలో పదవిలోకి తీసుకోవడం వివాదాస్పదమైంది. ఇలాంటి నిర్ణయాలు మొత్తం కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బతీయకపోయినా ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు