మోదీ.. ‘బ్రహ్మ, ది క్రియేటర్‌’

22 Nov, 2017 01:44 IST|Sakshi

పార్లమెంట్‌ సమావేశాల తేదీలు ఆయనకే తెలియాలంటూ కాంగ్రెస్‌ ఎద్దేవా

న్యూఢిల్లీ: గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నుంచి బీజేపీ తప్పించుకుంటోందంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో ఎవ్వరికీ తెలియదని, ‘బ్రహ్మ.. ది క్రియేటర్‌’ అయిన ప్రధాని మోదీకి మాత్రమే తెలుసని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే ఎద్దేవా చేశారు. మంగళవారం విలేరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పార్లమెంట్‌ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారన్న సమాచారం ఆయన మంత్రివర్గం, స్పీకర్, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కూ తెలియదని, అది ‘బ్రహ్మ’కు మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు. ఆ ‘బ్రహ్మ’ ఆదేశాలు జారీ చేస్తేగాని సమావేశాల తేదీలు తెలిసే అవకాశం లేదన్నారు. ప్రధాని నేతృత్వంలో ప్రజాస్వామ్యం కుదుపును ఎదుర్కొంటోందని ధ్వజమెత్తారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని పార్లమెంటులో ఎదుర్కోలేక బీజేపీ సిగ్గుతో పారిపోతోందని విమర్శించారు.

కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రాల్లో ‘ఎన్నికలు నిర్వహించే యంత్రాంగం’గా మారిందని, కేబినెట్‌ మంత్రులంతా ఢిల్లీ వదిలేసి ప్రచారాలకు అంకితమయ్యారని ఎద్దేవా చేశారు. గుజరాత్‌ ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే వరద బాధితులకు సహాయం ముసుగులో రూ.36,000 కోట్ల విలువైన బహుమతులను ఓటర్లకు బీజేపీ నేతలు పంచారని ఆరోపించారు.  

మరిన్ని వార్తలు