ఆ ఇద్దరిని అనర్హులను చేయండి

25 Dec, 2018 02:19 IST|Sakshi
మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు వినతి పత్రం అందిస్తున్న షబ్బీర్‌ అలీ, రాములు నాయక్‌

ఎమ్మెల్సీలు ఆకుల లలిత,సంతోష్‌లపై మండలి చైర్మన్‌కు కాంగ్రెస్‌ ఫిర్యాదు

పార్టీని విలీనం చేసే అధికారం చైర్మన్‌కు లేదు: షబ్బీర్‌ అలీ

సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీ నుంచి ఎన్నికై టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్‌లను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ కోరింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు పిటిషన్‌ ఇచ్చారు. తమ పార్టీ నుంచి ఎన్నికైన ఇద్దరు సభ్యులు పార్టీ మారినందున వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. మరోవైపు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతిరెడ్డిలు కూడా తమకు అందిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని మండలి చైర్మన్‌ను కోరారు. చైర్మన్‌ స్వామిగౌడ్‌ను కలసి రాములు నాయక్‌ లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. భూపతిరెడ్డి కూడా ఫిర్యాదు ఇచ్చేందుకు రాగా, చైర్మన్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో ఇచ్చారు.

ఇది ప్రజాస్వామ్యమేనా: షబ్బీర్‌ అలీ
మండలి చైర్మన్‌ను కలిసిన అనంతరం షబ్బీర్‌అలీ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన సంతోష్, లలితలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. చట్టాలను కాపాడాల్సిన వారే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు. తాము ఇచ్చిన పిటిషన్లను పట్టించుకోకుండా, టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేయగానే ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. బర్రెలను, గొర్రెలను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొంటున్నారని ఆరోపించారు. తమ పార్టీని ఇతర పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్‌కు గానీ, మండలి చైర్మన్‌కు గానీ లేదని, ఎన్నికల కమిషన్‌ మాత్రమే ఆ పనిచేయగలదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకుండా గెలిచిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌ తిరగడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

సామాజిక కార్యకర్తగానే ఎమ్మెల్సీ అయ్యా: రాములు నాయక్‌
తనను ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీ చేశారనే సమాచారాన్ని గవర్నర్‌ కార్యాలయం నుంచి కోరానని, అందుకే సమయం కావాలని అడిగినట్లు చెప్పారు. సామాజిక కార్యకర్త హోదాలోనే తనకు ఎమ్మెల్సీ అయ్యే అవకాశం వచ్చిందని, తాను టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైనట్లు కాదని, తాను కాంగ్రెస్‌ సభ్యుడిని కూడా కాదన్నారు. అయినా చైర్మన్‌ స్పందన సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. ఎస్టీని కాబట్టే కేసీఆర్‌ తనపై చర్యలు తీసుకుం టున్నారని, తనపై అక్రమ కేసులు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సుపారీ ఇచ్చి తనను అంతమొందించే కుట్ర జరుగుతోం దని, తనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారికో న్యాయం, తనకో న్యాయమా అని ప్రశ్నించారు. తనకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతానని, కోర్టుకు వెళ్తానని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాగా, తనకు అందిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు తనకు కూడా సమయం కావాలని కోరినట్లు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు