వారి ఓట్లు లెక్కించొద్దు

24 Mar, 2018 01:21 IST|Sakshi

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

నిబంధనలకు అనుగుణంగానే ఉండటంతో లెక్కించిన అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీ తరఫున గెలిచి రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓట్లేసిన ఏడుగురు ఎమ్మెల్యేల ఓట్లను కౌంటింగ్‌లో పరిగణనలోకి తీసుకోవద్దని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. జి. విఠల్‌రెడ్డి (ముథోల్‌), కాలె యాదయ్య (చేవెళ్ల), చిట్టెం రామ్మోహన్‌రెడ్డి (మక్తల్‌), ఎన్‌. భాస్కర్‌రావు (మిర్యాలగూడ), డి.ఎస్‌.రెడ్యా నాయక్‌ (డోర్నకల్‌), కోరం కనకయ్య (ఇల్లందు), పువ్వాడ అజయ్‌ (ఖమ్మం) పార్టీ విప్‌ను ధిక్కరించి తనకు చూపించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేశారని రాజ్యసభ ఎన్నికల కాంగ్రెస్‌ చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌ రేగా కాంతారావు శుక్రవారం రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఆ ఎమ్మెల్యేల ఓట్లను కౌంటింగ్‌లో పరిగణనలోకి తీసుకోవద్దని, వారు ఓట్లేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కూడా అనర్హులుగా ప్రకటించాలని ఆ ఫిర్యాదులో కోరారు. రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారితోపాటు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు ప్రతులను పంపారు. అయితే టీఆర్‌ఎస్‌కు ఓటేసిన ఆ ఎమ్మెల్యేలు నిబంధనలకు అనుగుణంగా కాంగ్రెస్‌ ఏజెంట్‌కు చూపించినందున వారి ఓట్లను కూడా అధికారులు పరిగణనలోకి తీసుకొని లెక్కించారు. 

కేసీఆర్‌వి నీచ రాజకీయాలు: ఉత్తమ్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీచ రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన అనంతరం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ ఎన్నికల్లో విప్‌ ధిక్కరించిన ఆ ఏడుగురు ఎమ్మెల్యేలను స్పీకర్‌ అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన మధుసూదనాచారిని కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థి చేసిన ఫిర్యాదుకు అసెంబ్లీ కార్యదర్శి కనీసం ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా