ఉత్కంఠగా రాజ్యసభ పోరు

5 Jun, 2020 15:54 IST|Sakshi

కాంగ్రెస్‌ అభ్యర్థిగా మల్లిఖార్జున్‌ ఖర్గే‌ ఖరారు

సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు ఈనెల 19న పోలింగ్‌ జరుగనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో  ఒక్కో సభ్యుడిని గెలిపించుకునేందుకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. దీంతో బీజేపీ (117) సునాయాసంగా ఇద్దరు సభ్యులను గెలిపించుకునే సంఖ్యా బలం ఉంది. ఇక 68 మంది సభ్యులున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఓ స్థానం దక్కనుంది. దీనికోసం ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గేను తమ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించింది. ఇక నాలుగో స్థానంపై ఇరు పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు కాంగ్రెస్‌ మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్‌ ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆ పార్టీకి అసెంబ్లీలో 34మంది సభ్యుల మద్దతు ఉంది. ఓ స్థానం గెలిచేందుకు మరో 10 స్థానాలకు దూరంగా ఉంది. (ఎన్నికల వేళ షాకిస్తున్న ఎమ్మెల్యేలు)

ఈ క్రమంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ జట్టు కట్టి మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత  దేవెగౌడను బరిలో దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేవెగౌడ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్‌ మద్దతు తెలిపేలా కుమారస్వామి ఇప్పటికే మంతనాలు ప్రారంభించినట్లు కన్నడ రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. హస్తం ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటిస్తే బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలను దక్కించుకున్నా, కాంగ్రెస్‌, జేడీఎస్‌ చెరో స్థానం గెలుపొందొచ్చు. అయితే వృద్ధాప్యం దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు  దూరంగా ఉండాలని దేవెగౌడ భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు కీలకమైన ఎన్నికల వేళ సభ్యులు జారిపోకుండా అన్ని రాజకీయ పక్షాలు జాగ్రత్త పడుతున్నాయి. (కాఫీ డే సిద్ధార్థ కోడలిగా డీకేశి కుమార్తె!)

ఇక ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడంతో టికెట్‌ కోసం ఆయా పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది. నాలుగింటిలో రెండు స్థానాలు కైవసం చేసుకోగలిగే బలం ఉన్న బీజేపీలో ఈ పోటీ అధికంగా ఉంది. ఒకవైపు మాజీ మంత్రి ఉమేశ్‌ కత్తి తన తమ్ముడు రమేశ్‌ కత్తికి టికెట్‌ ఇప్పించుకునేందుకు తీవ్రంగా లాబీయింగ్‌ చేస్తున్నారు. ఇందుకోసం గురువారం ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పతో సుమారు అరగంట పాటు ఉమేశ్‌ కత్తి సమావేశమై టికెట్‌ కోసం విన్నవించారు. మరోవైపు మంత్రి రమేశ్‌ జార్కిహొళి గురువారం రాత్రి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం జరపడం చర్చనీయాంశమైంది. మొత్తానికి రాజకీయ రంగస్థలానికి వేదికగా నిలిచే కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. ఎన్నికలు ముగిసేలోపు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
 

మరిన్ని వార్తలు