అవినీతిని అధికారికం చేస్తున్నారు

22 Nov, 2019 04:32 IST|Sakshi

ఎలక్టోరల్‌ బాండ్స్‌కు సంబంధించి బీజేపీపై కాంగ్రెస్‌ విమర్శ

న్యూడిల్లీ: ‘ఎలక్టోరల్‌ బాండ్స్‌’పై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ అవినీతిని అధికారికం చేసే పరోక్ష, రహస్య విధానం ఇదని కాంగ్రెస్‌ మండిపడింది. ఎలక్టోరల్‌ బాండ్స్‌పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. నల్లధనాన్ని అరికట్టే దిశగా, న్యాయమైన డబ్బు రాజకీయాల్లోకి వచ్చేలా తీసుకొచ్చిన బాండ్స్‌ను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని బీజేపీ ఎదురు దాడి చేసింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఎలక్టోరల్‌ బాండ్స్‌ అంశాన్ని కాంగ్రెస్‌ లేవనెత్తింది.

ఎలక్టోరల్‌ బాండ్స్‌లో పారదర్శకత లేదని, ఆ బాండ్స్‌ను ఎవరు, ఏ పార్టీ కోసం కొంటున్నారనే సమాచారం ఉండదని కాంగ్రెస్‌ సభ్యుడు మనీశ్‌ తివారీ విమర్శించారు. ఈ విధానం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఓడిపోయిన, ప్రజలు తిరస్కరించిన రాజకీయ నేతల పక్షాన కాంగ్రెస్‌ వాదిస్తోందని బీజేపీ నేత, కేంద్రమంత్రి పియూశ్‌ గోయల్‌ ప్రతివిమర్శ చేశారు. బ్లాక్‌మనీకి కాంగ్రెస్‌ నేతలు అలవాటు పడ్డారని, పారదర్శక నిధులు ఎన్నికల్లోకి రావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నారు. ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారం సమాచార హక్కు(ఆర్టీఐ) ద్వారా పొందవచ్చని గోయెల్‌ గుర్తు చేశారు.
 

మరిన్ని వార్తలు