మాయావతితో కాంగ్రెస్‌ మంతనాలు

11 Dec, 2018 18:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సానుకూల ఫలితాలు సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సాధారణ మెజారిటీ సాధించినా, మధ్యప్రదేశ్‌లో మేజిక్‌ మార్క్‌కు అవసరమైన మెజారిటీ రాకుంటే ఏం చేయాలనేదానిపై కసరత్తు వేగవంతం చేసింది.

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 116 స్ధానాలు రాకుంటే కాంగ్రెస్‌కు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మద్దతు అనివార్యమవుతుంది. ప్రస్తుతం 115 స్ధానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉన్నప్పటికీ మాయావతి సాయం కోరేందుకు కాంగ్రెస్‌ నేతలు సంసిద్ధమయ్యారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ మాయావతితో ఫోన్‌లో సంప్రదింపులు జరిపిన మీదట పార్టీ నేతలతో ఢిల్లీలో సమావేశానికి మాయావతి సిద్ధమైనట్టు సమాచారం.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుతీరుతుందని కమల్‌ నాథ్‌ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రాజస్ధాన్‌లోనూ మిత్రపక్షాలతో కలిసి సాగేందుకు కాంగ్రెస్‌ సంకేతాలు పంపింది. రాజస్ధాన్‌లో తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ సాధించినా భావసారూప్య పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ చెప్పారు.

>
మరిన్ని వార్తలు