కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం

24 Jun, 2019 19:24 IST|Sakshi

యూపీలో అన్ని జిల్లా కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం

లక్నో: ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీ.. ఓటమికి గల కారణాలను అన్వేషించి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ముఖ్యంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ దారుణ వైఫల్యం చెందింది. ఈ నేపథ్యంలో అధిష్టానం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలోని అన్ని జిల్లా కమిటీలను రద్దు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాలకుగాను యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క రాయబరేలి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.

తమ కుటుంబానికి కంటుకోటగా ఉన్న అమేథీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఆయనపై బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ 55,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాగా, తూర్పు యూపీ, పశ్చిమ యూపీకి ఇన్‌చార్జులుగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా ప్రతిపాదనలకు అనుగుణంగానే యూపీలో జిల్లా కమిటీలను రద్దు చేసినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. దీంతో పార్టీపై పట్టుకు ప్రియాంక కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరుగనున్న ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు సభ్యుల కమిటీని కాంగ్రెస్ తాజాగా నియమించింది.

సంస్థాగతంగా మార్పులు చేసేందుకు పార్టీ సీనియర్‌ నేత అజయ్ కుమార్ లల్లూను ఇన్‌చార్జిగా నియమించింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడ్డారంటూ అందిన ఫిర్యాదులను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల క్రమశిక్షణా కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ తాజా ఉత్తర్వులో పేర్కొంది. కాగా నష్టనివారణ చర్యలో భాగంగా ఈనెల 19న కర్ణాటక కాంగ్రెస్ కమిటీని పార్టీ రద్దు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు