ఆప్‌తో పొత్తుపై తుది నిర్ణయం రాహుల్‌దే

26 Mar, 2019 03:32 IST|Sakshi

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌)తో పొత్తుపై అంతిమ నిర్ణయం తీసుకునే బాధ్యతను కాంగ్రెస్‌ ఢిల్లీ విభాగంపార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపైనే ఉంచింది. ఈ అంశంపై చర్చించేందుకు రాహుల్‌ గాంధీ అధ్యక్షతన సోమవారం ఇక్కడ జరిగిన సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌తోపాటు ముగ్గురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు దేవేందర్‌ యాదవ్, రాజేశ్‌ లిలోథియా, హరూన్‌ యూసఫ్‌ పొత్తును వ్యతిరేకించగా ఢిల్లీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షులు అజయ్‌ మాకెన్, సుభాష్‌ చోప్రా, తాజ్దర్‌ బాబర్, అర్వీందర్‌ సింగ్‌ లవ్లీ పొత్తుకు సుముఖత వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనంటూ పార్టీ అధినేత రాహుల్‌కు నేతలు చెప్పారు. పొత్తుకు అనుకూలంగా ఉన్నామంటూ ఢిల్లీ ప్రాంత 12 జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, పార్టీ నేతలు, కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేఖలను ఢిల్లీ కాంగ్రెస్‌ ఏఐసీసీ ఇన్‌ఛార్జి పీసీ చాకో రాహుల్‌కు అందజేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

>
మరిన్ని వార్తలు