‘లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం’

6 Feb, 2019 00:31 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను, సమస్యలను అధిగమించి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటుతామని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేం దుకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ మంగళవారం ఇక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను రాహుల్‌కు వివరించామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్ల సాధనకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని రాహుల్‌ సూచించారన్నారు. దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించి పనిచేయాలని ఆదేశించారన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో సమర్థవంతంగా ముందుకెళ్లాలని రాహుల్‌ సలహా ఇచ్చారని  టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ చెప్పారు. దీని కోసం తుది కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు రెండు, మూడు రోజుల్లో మళ్లీ ఏఐసీసీ కార్యదర్శితో తాను, సీఎల్పీ నేత సమావేశమవ్వాలని రాహుల్‌ ఆదేశించారన్నారు. సమావేశంలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం, రేవంత్‌రెడ్డి, కుసుమకుమార్, ఎమ్మెల్యేలు సబితా, సీతక్క, హరిప్రియ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, గండ్ర, వనమా వెంకటేశ్వరరావు, సుధీర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, కాంతారావు, జయప్రకాశ్‌రెడ్డి, సురేందర్, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, ఉపేందర్‌రెడ్డి, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీలు షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు