‘జయ జయహే తెలంగాణ’ 

18 Nov, 2018 03:00 IST|Sakshi

మేమొస్తే ఇదే రాష్ట్రగీతం 

మేనిఫెస్టోలో హామీ ఇవ్వనున్న కాంగ్రెస్‌ 

మరిన్ని విడుదలకు కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన మేనిఫెస్టోను మరో మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేసేందుకు కాంగ్రెస్‌ కసరత్తులు చేస్తోంది. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ ,తొలి ఏడాది లక్ష ఉద్యోగాలు, 100 రోజుల్లో మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించింది. వీటితోపాటే రేషన్‌దారులకు సన్నబియ్యం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇం దిరమ్మ బిల్లుల చెల్లింపులు వంటివి ప్రజల ముం దుంచింది. మరిన్ని కీలక అంశాలను జోడిస్తూ మేని ఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ నేతృ త్వంలోని కమిటీ రూపకల్పన చేసింది. సుపరిపాలన అంశానికి తొలి ప్రాధాన్యత ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖ కవి అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’గీతాన్ని ప్రకటించనుంది. ప్రజా పాలనంతా సచివాలయం నుంచే జరుగుతుందని, ముఖ్యమంత్రి సహా మంత్రులంతా సచివాలయం కేంద్రంగా పనిచేస్తారని చెప్పనుంది. 

ఉద్యమకారులకు ప్రాధాన్యమిచ్చేలా... 
మీడియాకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడేలా ప్రజాప్రభుత్వం ఉంటుందన్న అంశాలకు ప్రాధాన్య త ఇవ్వనుంది. ఉద్యమ కారులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నియోజకవర్గానికి ఒక అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు, 2009 తర్వాత మరణించిన ఉద్యమ కారుల కుటుంబాలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం, ఉద్యమకారులపై కేసులన్నీ మాఫీ వంటి వాటిని జతపరిచినట్లు తెలిసింది. ఎస్సీల్లో మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, సంక్షేమానికి నిధులు వెచ్చించడంతో పాటు, ఎస్టీల్లో లంబాడాలకు ఒకటి, కోయ, గోండులను కలిపి ఇంకొకటి, ఇతర తెగలకు కలిపి మరొక కార్పొరేషన్‌ ఏర్పాటు, బీసీల్లోనే ఇదేమాదిరి కార్పొరేషన్‌ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనుంది. 

ఎల్లంపల్లి వరకూ నీటికి ప్రణాళిక: సాగునీటి ప్రాజెక్టుల సత్వర పూర్తికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూనే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరించిన ప్రాణ హితలో భాగంగా చేపట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తిచేసి ఎల్లంపల్లి వరకు నీటిని తర లించే అంశాన్ని మేనిఫెస్టోలో ప్రస్తావించనుంది. ఈ బ్యారేజీని పూర్తి చేసి చేవెళ్ల వరకు నీటిని తరలించడం ద్వారా రంగారెడ్డి జిల్లాలో ఆయకట్టుకు నీళ్లిస్తామని హామీ ఇవ్వనుంది. వీటితోపాటే సింగరేణిలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్య లు తీసుకోవడం, కొత్తగా అనుకూలమైన ప్రాంతాల్లో భూగర్భ మైనింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రకటన చేయ నుంది. జర్నలిస్టులకు హెల్త్‌స్కీమ్, ఇళ్ల స్థలాలు, లాయర్లకు రూ.200కోట్లతో భవిష్యనిధి, సీపీఎస్‌ రద్దు, మైనార్టీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు, సచార్, సుధీర్‌ కమిటీ నివేదికల అమలు వంటి అంశాలను పొందుపరిచినట్లుగా కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. 

>
మరిన్ని వార్తలు