మూడో వంతు సీట్లలో తిరుగుబావుటా!

22 Oct, 2018 02:10 IST|Sakshi

 కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారనున్న అభ్యర్థుల ఎంపిక

జాబితా ప్రకటన తర్వాత రంజుగా మారనున్న రాజకీయం

ఒక్కో స్థానానికి ముగ్గురు నుంచి ఐదుగురి మధ్య పోటీ

ఎవరికి టికెట్‌ ఇచ్చినా మిగిలిన వారి సహకారం డౌటే!

ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే ఆరు చోట్ల తిరుగుబాటు?

గ్రేటర్‌ పరిధిలో కూటమితో కొత్త చిక్కులు

30-40 స్థానాల్లో రెబెల్స్‌ బరిలో ఉండే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమి ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీలో తుపాను ముందు ప్రశాంతత కనిపిస్తోంది. ఓ వైపు కూటమి పార్టీలతో పొత్తు విషయం కొలిక్కిరాక సతమతమవుతుంటే.. మరోవైపు, ఎన్నికల బరిలో దిగడంపై కాంగ్రెస్‌ నేతల్లోనే తీవ్రమైన పోటీ నెలకొంది. పోటీ చేసే అభ్యర్థుల ఖరారు జాబితాలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామని ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలు భావిస్తున్నప్పటికీ.. తిరుగుబాటు తుట్టెను కదిపేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఒక్కసారి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటన జరగడమే ఆలస్యం.. రెబెల్స్‌గా పోటీచేసేందుకు, ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు.. ఖరారైన అభ్యర్థులకు సహాయ నిరాకరణ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. దీంతో కాంగ్రెస్‌కు మున్ముందు ముసళ్ల పండుగ తప్పదనిపిస్తోంది. దాదాపు 30–40 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందని.. 30 చోట్ల రెబెల్స్‌ బెడద తప్పకపోవచ్చని పార్టీ ముఖ్యనేతలే చెబుతుండటం గమనార్హం.  

అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి 
అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండే కాంగ్రెస్‌లో టికెట్‌ ఆశించే నేతల సంఖ్య సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం ఇద్దరు ముగ్గురు టికెట్‌ ఆశిస్తారు. కొన్నిచోట్ల పోటీచేసే సామర్థ్యమున్న నాయకులు ఐదు మంది కూడా ఉంటారు. అయితే, ఈసారి కూడా అందుకు భిన్నమైన పరిస్థితులేమీ కనిపించడం లేదు. మొత్తం రాష్ల్రంలోని 119 నియోజకవర్గాలకు గానూ.. వెయ్యికి పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. గరిష్టంగా ఇల్లందు నియోజకవర్గం నుంచి 30 దరఖాస్తులు వచ్చాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇప్పుడిప్పుడే అసమ్మతి ఛాయలు కనిపిస్తున్నాయి. టికెట్‌ ఆశిస్తున్న నేతలు.. ఒకవేళ అనుకున్నది జరక్కపోతే ఏంచేయాలనే దానిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని సమాచారం. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలకు గానూ.. టికెట్లు ఎవరికి వచ్చినా ఆరు చోట్ల రెబల్స్‌ బరిలో దిగే అవకాశముందన్న సమచారం కాంగ్రెస్‌ పెద్దల్లో గుబులు పుట్టిస్తోంది. వరంగల్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్‌ వంటి టీఆర్‌ఎస్‌కు పట్టున్న జిల్లాల్లో అసమ్మతి బెడద కనిపిస్తుండడంతో టీపీసీసీ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పార్టీ బలంగా ఉందని భావిస్తున్న మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఈ అసమ్మతి, అసంతృప్తి స్పష్టంగానే బహిర్గతం కానున్నాయి.  
 

గ్రేటర్‌లో ‘కూటమి’ కట్టేనా? 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో కూటమిలో భాగంగా టీడీపీ, టీజేఎస్‌లకు ఎన్ని టికెట్లు ఇస్తారన్న స్పష్టత రాకపోవడంతో పరిస్థితి గందరగళంగా ఉంది. శేరిలింగంపల్లి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాలను ఇతర పార్టీలకు ఇస్తారా.. కాంగ్రెస్‌ పోటీచేస్తుందా అన్నది తేలలేదు. సనత్‌నగర్, ముషీరాబాద్, ఖైరతాబాద్‌ స్థానాల్లోనూ కొంత గందరగోళం ఉంది. ఈ నేపథ్యంలో.. కనీసం 40 స్థానాల్లో రగలనున్న అసంతృప్తి జ్వాలలను ఎలా చల్లబరచాలన్నది కాంగ్రెస్‌ పెద్దలకు తలనొప్పిగా మారింది. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గెలుపుపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వారిలో నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీలో ఇవన్నీ సహజమేననే పైకి చెబుతున్నప్పటికీ.. ఈసారి అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు పేర్కొనడం గమనార్హం. 
 
బలమైన నేతలు ‘రెబల్స్‌’ అయ్యే అవకాశాలున్న స్థానాలు: 

  • వర్ధన్నపేటలో కొండేటి శ్రీధర్, బక్క జడ్సన్, డాక్టర్‌ విజయ్‌కుమార్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.  
  • స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి విజయ రామారావు, ఇందిర, మాదాసి వెంకటేశ్, దొమ్మాటి సాంబయ్య ఆశావహుల జాబితాలో ఉన్నారు. 
  • వరంగల్‌ (వెస్ట్‌)లో.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. 
  • ఆర్మూర్‌ టికెట్‌ ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజారాం యాదవ్‌ రెబల్‌గా పోటీకి సిద్ధమవుతున్నారు 
  • బాల్కొండలో వేముల రాధికారెడ్డి పేరు తెరపైకి రాగా.. టికెట్‌ రాకపోతే రెబల్‌గా పోటీచేయాలని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. 
  • బోధన్‌లో సుదర్శన్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే.. తానూ పోటీచేస్తానని ఉప్పు సంతోశ్‌ బహిరంగంగా ప్రకటించారు. 
  • కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ పోటీ ఖాయమే అయినా నల్లవెల్లి అశోక్‌ నామినేషన్‌ రెబల్‌గా వేస్తానంటున్నారు. 
  • జుక్కల్‌లో గంగారాం, అరుణతారల్లో ఎవరికి టికెట్‌ వచ్చినా మరొకరు పోటీ చేయడం తప్పేట్లు లేదు. 
  • బాన్సువాడలో కాసుల బాలరాజ్, మాల్యాద్రి రెడ్డిలు టికెట్‌ ఆశిస్తున్నారు. 
  • ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డి రంగారెడ్డి, క్యామ మల్లేశ్, మల్‌రెడ్డి రాంరెడ్డిలు ఆశావహుల జాబితాలో ఉన్నారు. 
  • తాండూరులో పైలట్‌ రోహిత్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, రమేశ్, సి.లక్ష్మారెడ్డి, సునీతా సంపత్‌లు టికెట్‌ ఆశిస్తున్నారు. 
  • కరీంనగర్‌లో పొన్నం ప్రభాకర్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, కె.మృత్యుంజయం, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌ తమకే టికెట్‌ అని భరోసాతో ఉన్నారు. 
  • హుస్నాబాద్‌ను సీపీఐకి ఇస్తే.. అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి స్వతంత్రుడిగా బరిలో ఉండడం ఖాయమే.  
  • కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి ఇచ్చినా అక్కడా కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న వనమా వెంకటేశ్వరరావు, ఎడవెల్లి కృష్ణల్లో ఒకరు పోటీ చేయడం ఖాయమే. 
  • హుజూరాబాద్‌లో పాడి కౌశిక్‌ రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్‌లు టికెట్‌ ఆశిస్తున్నారు. 
  • చొప్పదండిలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి సత్యం, గజ్జెల కాంతం మధ్య ప్రధాన పోటీ ఉంది. 
  • ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మద్దెల రవీందర్, కవ్వంపల్లి సత్యనారాయణ ఆశావహుల జాబితాలో ఉన్నారు. 
  • వేములవాడలో ఏనుగు మనోహర్‌రెడ్డి, కనగాల మహేశ్, ఆది శ్రీనివాస్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. 
  • రామగుండంలో మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్, జనక్‌ ప్రసాద్‌లు టికెట్‌ నాకంటే నాకేనని పోటీ పడుతున్నారు. 
  • దేవరకొండలో జడ్పీ చైర్మన్‌ బాలూ నాయక్, రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరిన బిల్యానాయక్, ఉత్తమ్‌ అనుచరుడు జగన్‌లాల్‌ నాయక్‌ పోటీలో ఉన్నారు. 
  • మునుగోడులో ఎమ్మెల్సీ రాజగోపాల్‌ రెడ్డి, పాల్వాయి స్రవంతి, బీసీ కోటాలో నారబోయిన రవిల పేర్లు స్క్రీనింగ్‌ కమిటీకి వెళ్లాయని అంటున్నారు. టికెట్‌ రాకపోతే రెబల్‌గా పోటీకి రాజగోపాల్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 
  • సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, పటేల్‌ రమేశ్‌రెడ్డిల మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. 
  • నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఉత్తమ్‌ అనుచరుడు డాక్టర్‌ ప్రసన్న రాజ్‌ టికెట్లు అడుగుతున్నారు. 
  • నారాయణ్‌ఖేడ్‌లో డాక్టర్‌ పి.సంజీవరెడ్డి, సురేశ్‌ షెట్కార్‌లు టికెట్‌ ఆశిస్తున్నారు. 
  • దుబ్బాకలో చెరుకు ముత్యంరెడ్డి, శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి, మద్దుల నాగేశ్వర్‌రెడ్డిల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. 
  • ఇల్లెందులో 30 మంది టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక్కడ ఎవరికి టికెట్‌ వచ్చినా స్థానికంగా పట్టున్న ఒకరిద్దరు నేతలు బరిలో ఉండే అవకాశం ఉంది. 
  • మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డిలు నువ్వా నేనా అనే రీతిలో పోటీపడుతున్నారు. 
  • సిర్పూర్‌లో పాల్వాయి హరీశ్‌ బాబు, రావి శ్రీనివాస్‌లు ప్రధాన ఆశావహులుగా ఉన్నారు.   
మరిన్ని వార్తలు