‘రాజ్యసభ బరి’లో కాంగ్రెస్‌ అభ్యర్థి

8 Aug, 2018 01:48 IST|Sakshi

ఎన్డీఏకు అనుకూలంగా మరికొన్ని పార్టీలు

నేడు నామినేషన్లకు ఆఖరు తేదీ

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవికి అధికార ఎన్డీఏ హరివంశ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించగా ప్రతిపక్షాలు కాంగ్రెస్‌కే ఆ అవకాశం ఇచ్చాయి. దీంతో తమ అభ్యర్థి బరిలో ఉంటారని కాంగ్రెస్‌ ప్రకటించింది. జేడీయూకు చెందిన హరివంశ్‌ను ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించింది. అదే సమయంలో అధికార బీజేపీ మరో అడుగు ముందుకేసింది. బిహార్‌ సీఎం ద్వారా ఒడిశా సీఎం పట్నాయక్‌కు ఫోన్‌ చేయించి అనుకూలమైన ఫలితాలను రాబట్టగలిగిందని సమాచారం.

దీంతో బిజూ జనతాదళ్‌కు చెందిన 9 మంది సభ్యులు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ రేసులో బీజేడీ మద్దతు కీలకంగా మారనుంది. కేంద్రంలోని బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించే శివసేన కూడా ఎన్డీఏకు సానుకూల సంకేతాలు పంపిందని సమాచారం. అయితే, ఓటింగ్‌ మొదలయ్యే గంట ముందు తమ నిర్ణయం వెలువరిస్తామని ప్రకటించింది. తెలంగాణలో  టీఆర్‌ఎస్‌ హరివంశ్‌కే ఓటేస్తామని తెలిపింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఈనెల 9వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నికలు జరగనుండగా నామినేషన్లకు నేడే చివరి తేదీ.

కాంగ్రెస్‌ అభ్యర్థికే అవకాశం
ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో ఉంచేందుకు మంగళవారం ఢిల్లీలో పలు దఫాలు చర్చలు జరిపారు. ఎన్‌సీపీ, ఎస్‌పీ, టీఎంసీ, బీఎస్‌పీ, వామపక్ష పార్టీలు తమ తరఫున ఎవరినీ బరిలో ఉంచబోమని ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కే ఆ అవకాశం వదిలిపెట్టాయి.

ఆ పార్టీ ప్రకటించే అభ్యర్థినే బలపరుస్తామని టీడీపీ సహా ప్రతిపక్షం ప్రకటించింది. దీంతో నామినేషన్లకు ఆఖరి రోజైన బుధవారం తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు ప్రకటించారు. బీజేపీ తమ అభ్యర్థి గెలుపు కోసం అన్ని మార్గాలనూ అన్వేషిస్తోందని ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారు. తమ మాట వినని పార్టీలు, నేతలపై కేసులు, ఆరోపణలు, సీబీఐ దాడులు తదితర అస్త్రాలతో బెదిరింపులకు పాల్పడుతుందని అంటున్నారు.

>
మరిన్ని వార్తలు