యడ్యూరప్పపై ఏసీబీకి ఫిర్యాదు

25 May, 2018 08:37 IST|Sakshi
కర్ణాటక బీజేపీ శాసనసభా పక్ష నేత యడ్యూరప్ప

సాక్షి, బెంగుళూరు : ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కర్ణాటక భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శాసనసభా పక్ష నేత యడ్యూరప్ప ప్రయత్నించారంటూ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ గురువారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి ఫిర్యాదు చేసింది. యడ్యూరప్పతో పాటు మరో ఐదుగురు బీజేపీ నాయకులు కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చి కొనుగోలు చేసేందుకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొంది.

బల నిరూపణ సమయంలో ఈ తతంగం నడిచిందని వివరించింది. బీజేపీ నాయకులు బేరసారాలు సాగించిన ఆడియో టేపులను ఇందుకు ఆధారాలుగా సమర్పించింది. కాగా, బల నిరూపణకు ముందు బీజేపీ నేతలకు సంబంధించిన ఆడియో టేపులను విడుదల చేసిన కాంగ్రెస్‌ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ ఆ టేపులు నకిలీవని, తమ గొంతులను మిమిక్రీ చేసి రికార్డు చేశారని ఆరోపించింది.

కాగా, కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ ఫిర్యాదుపై ఏసీబీ ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు. యడ్యూరప్ప, ఆయన తనయుడు విజయేంద్ర, బీజేపీ కర్ణాటక ఇంచార్జ్‌ మురళీధర్‌ రావు, గాలి జనార్ధన్‌ రెడ్డి, బీ శ్రీరాములు, బీజే పుట్టస్వాములు ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారని ఫిర్యాదులో కాంగ్రెస్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు