అయ్యా మోదీ.. నీ ఎన్నికల సభ కాదిది!

26 Feb, 2019 08:58 IST|Sakshi

ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఫైర్‌

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీపై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో సైన్యం, దేశ భద్రత నేరపూరిత నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత వారి సొంత కుటుంబానికి ఉండేదనీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యత దేశానికి ఇచ్చామన్నారు. రక్షణ ఆయుధాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, బలగాలను బలోపేతం చేయడం తదితరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉండేవనీ, తాము వచ్చాక వాటికి ఆమోదం లభించిందని మోదీ వెల్లడించారు.

అయితే వార్‌మెమోరియల్‌ ప్రారంభ సమావేశంలో మోదీ రాజకీయ ప్రసంగం చేయడంపై పలు పార్టీల నాయకులు, మేధావులు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్‌ అయితే.. ‘మోదీ.. ఇది నీ ఎన్నికల సభ అనుకుంటున్నావా?’ అని ఘాటుగా ప్రశ్నిస్తోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను స్మరించుకునే సందర్భంలో మోదీ రాజకీయ ప్రసంగం చేయడం ఏంటని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. జవాన్ల మరణాన్ని కూడా ఓట్లు, రాజకీయాల కోసం మోదీ వాడుకుంటున్నారని మండిపడ్డారు. అమరుల స్మారక సభను.. ఎన్నికల ప్రచార సభగా మార్చి వీర జవాన్ల త్యాగాలను అవమానించవద్దని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. 70 ఏళ్లుగా ఏర్పాటు కానీ జాతీయ యుద్ధ స్మారక ఏర్పాటు క్రెడిట్‌ మోదీదేనని, కానీ ఆయన రాజకీయ ప్రసంగమే తీవ్రంగా నిరాశపర్చిందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఓమర్‌ అబ్దుల్లా తెలిపారు. ఆయన ప్రసంగంతో స్మారక సభ కాస్త బీజేపీ ఎన్నికల ప్రచార సభగా తలిపించిందన్నారు. ప్రముఖ జర్నలిస్ట్‌ సాగరి​కా ఘోష్‌ సైతం ప్రధాని నరేంద్ర మోదీని తప్పుబట్టారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల శౌర్యాన్ని దేశం గుర్తు చేసుకోవాల్సిన సందర్భంలో రాజకీయప్రత్యర్థులపై విమర్శలు చేయడం సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు.

ఇక బ్రిటిష్‌ కాలం నాటి యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం నిర్మించిన ఇండియా గేట్‌ పక్కనే తాజా స్మారకాన్ని 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది  అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై సువర్ణాక్షరాలతో లిఖించారు.

చదవండి: యుద్ధ స్మారకం అంకితం

మరిన్ని వార్తలు