రజనీకాంత్‌ ప్రశంసలు.. కాంగ్రెస్‌ ఫైర్‌

13 Aug, 2019 12:01 IST|Sakshi

చెన్నై: రజనీకాంత్‌ మహాభారతాన్ని మరోసారి పూర్తిగా చదివితే మంచిది అంటున్నారు తమిళ కాంగ్రెస్‌ నాయకులు. ఇంతకు విషయం ఏంటంటే.. ఆర్టికల్‌ 370 రద్దు, కశ్మీర్‌ విభజన అంశాల్లో రజనీకాంత్‌ బీజేపీకి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు రజనీకాంత్‌ పాల్గొని మోదీ,అమిత్‌షాలను కృష్ణార్జులుగా పేర్కొంటూ ప్రశంసల వర్షం కురించారు. రజనీ వ్యాఖ్యల పట్ల తమిళ కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

దీనిపై కాంగ్రెస్‌ నాయకుడు కేఎస్‌ అలిగిరి స్పందిస్తూ.. ‘రజనీ వ్యాఖ్యలు నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే.. కశ్మీర్‌ కూడా ప్రత్యేకప్రతిపత్తి కల్పించారు. అలాంటప్పుడు కశ్మీర్‌ను మాత్రమే విభజించడం ఏంటి. కశ్మీర్‌లో ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉండటం వల్లనే ఆర్టికల్‌ 370ని రద్దు చేశారు. రజనీకాంత్‌ వ్యాఖ్యలు కశ్మీర్‌కు ఒక న్యాయం.. మిగతా రాష్ట్రాలకు ఒక న్యాయం అనే అంశాన్ని బలపరుస్తున్నాయి. అంతేకాక కోట్లాది మంది ప్రజల హక్కులను కాలరాసిన మోదీ-అమిత్‌ షాలను రజనీకాంత్‌ కృష్ణార్జునులుగా వర్ణించడం సమంజసంగా లేదు. రజనీకాంత్‌ మరోసారి మహాభారతాన్ని క్షుణ్ణంగా చదివితే మంచిదం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు