చేవెళ్ల టు హుజూరాబాద్‌

9 Mar, 2018 01:06 IST|Sakshi

కాంగ్రెస్‌ తొలిదశ బస్సుయాత్ర ముగింపు

యాత్ర తీరుపై పార్టీ నేతల్లో సంతృప్తి

టీఆర్‌ఎస్‌ వ్యతిరేక పవనాలు

స్పష్టంగా కనిపించాయన్న ధీమా

సాక్షి, హైదరాబాద్‌: చేవెళ్ల సెంటిమెంటు.. నేతల ఐక్యతారాగం.. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీత.. స్థానిక సమస్యల ప్రస్తావన.. ఎన్నికల హామీలు.. బహిరంగసభలు.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ చేపట్టిన ‘ప్రజా చైతన్య బస్సు యాత్ర’తొలిదశ గురువారంతో ముగిసింది.

ఎనిమిది రోజుల పాటు రెండు దఫాలుగా సాగిన ఈ యాత్రలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించారు. టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా హాజరై ఐక్యతారాగాన్ని చాటడం విశేషం. మొత్తంగా తొలిదశ యాత్ర తీరుపై పార్టీలో నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీపై వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌పై విమర్శల దాడి
తొలిదశ బస్సుయాత్రలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ నేతలు పర్యటించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పించారు.

సీఎం కేసీఆర్‌ ఎన్నికల సందర్భంలో, అంతకుమందు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ.. దళిత సీఎం, ఇంటికో ఉద్యోగం, రైతు రుణమాఫీ, మూడెకరాల భూ పంపిణీ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు తదితర అంశాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మిషన్‌కాకతీయ, భగీరథ, ఇతర ప్రాజెక్టుల్లో భారీగా అక్రమాలు   జరుగుతున్నాయని ఆరోపణలూ గుప్పించారు.

పకడ్బందీగా సభలు
సభల నిర్వహణలోనూ కాంగ్రెస్‌ యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించింది. తొలిరోజున చేరికలతో ప్రారంభమైన యాత్ర.. చేవెళ్ల సెంటిమెంట్‌తో ముందుకు సాగింది. దాదాపు అన్ని సభలకు భారీగానే న సమీకరణ చేసింది. పార్టీకి మంచి బలమున్న మెదక్, నిజామాబాద్‌లతో పాటు టీఆర్‌ఎస్‌ ప్రాబల్యమున్న ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లో జరిగిన సభలకు కూడా జనం భారీగానే హాజరుకావడంతో కాంగ్రెస్‌ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

సభ నిర్వహణ ఆలస్యమైనా కేడర్‌ ఓపికతో ఉన్నారని, సభ పూర్తయ్యేవరకు ఉండి నేతలు మాట్లాడిందంతా విని వెళ్లారని... ఇది ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతకు నిదర్శనమని ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, బస్సుయాత్ర సభలు ఎన్నికల సభలను తలపించాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షం చేస్తున్న బస్సుయాత్రపై అధికార టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేసినా.. కాంగ్రెస్‌ నేతలు దీటుగానే సమాధానాలు ఇచ్చారు.     మొత్తంగా తొలిదశ యాత్రతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  


ఎన్నికల హామీలు
వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, డ్వాక్రా మహిళలకు రూ.లక్ష రివాల్వింగ్‌ ఫండ్, అభయహస్తం పింఛన్‌ పెంపు, పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి వంటివి అమలు చేస్తామని బస్సుయాత్రలో హామీలు గుప్పించారు. వీటితోపాటు ఎక్కడికక్కడ స్థానిక అంశాల ప్రస్తావన, సమస్యల పరిష్కారానికి హామీలిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

మరిన్ని వార్తలు