‘పురం’.. ఇక మా పరం! 

23 Jul, 2019 01:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘పుర’ఎన్నికలపై కాంగ్రెస్‌ ధీమాగా ఉంది. ప్రజల తమకే పట్టం కడతారని గట్టిగా చెబుతోంది. పట్టణ ప్రాంత ప్రజలు, నిరుద్యోగులు కాంగ్రెస్‌కే ఓట్లు వేస్తారని, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని టీపీసీసీ మున్సిపల్‌ ఎన్నికల కమిటీ ధీమా వ్యక్తం చేసింది. మున్సిపల్‌ ఎన్నికల సన్నద్ధతపై చర్చించేందుకు కమిటీ కన్వీనర్‌ పొన్నం ప్రభాకర్, సభ్యులు ఎస్‌.సంపత్‌ కుమార్, వంశీచంద్‌రెడ్డిలు సోమవారం ఇక్కడి గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని పొన్నం ఆరోపించారు. ఇప్పుడు కొత్త మున్సిపల్‌ చట్టం ద్వారా ‘పుర’ప్రజాప్రతినిధులను గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్ని స్తున్నారన్నారు. కొత్త మున్సిపల్‌ కార్పొరేషన్లను  రాజకీయకోణంలోనే ఏర్పాటు చేశారని, 20–25 వార్డులున్న మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా చేశారని, మరి 49 వార్డులున్న మహబూబ్‌నగర్‌ను కార్పొరేషన్‌ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సెలెక్ట్‌ అండ్‌ ఎలెక్ట్‌ పద్ధతిలో అభ్యర్థులను నిర్ణయిస్తామని, గెలిచాక పార్టీ మారకుండా ముందే అఫిడవిట్‌లు తీసుకుని అభ్యర్థులను బరిలో దించుతామన్నారు.  

వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే కొత్త చట్టం
ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ మాట్లాడుతూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రతోనే పాలకులు కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలను తప్పులతడకగా తయారు చేశారని, వార్డుల విభజన అసంబద్ధంగా ఉందని అన్నారు. ఒక్క మున్సిపల్‌ ఎన్నికల విషయంలోనే కోర్టు ఈ ప్రభుత్వానికి అనేకసార్లు మొట్టికాయలు వేసిందని, ఈ తప్పులకు బాధ్యత వహించి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగితే ఓడిపోతారనే భయంతోనే దొడ్డిదారిన వార్డుల విభజన చేశారన్నారు. బలహీన వర్గాల రిజర్వేషన్లను టీఆర్‌ఎస్‌ తగ్గిస్తే తాము వారికి సగం సీట్లు కేటాయించబోతున్నామని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు